ఏంటో.. టాలీవుడ్ రోజులు బాలేవు. మార్చి మొదటి వారంలో థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు ఆగాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి సీనే మళ్లీ చూసే ప్రమాదం కనిపిస్తోంది. చిత్రసీమలో మళ్లీ ‘బంద్’ వాతావరణం కనిపించే అవకాశాలున్నాయి. ఈసారి లైట్స్మెన్ ఎర్రజెండా చూపించబోతున్నారని టాక్. వేతనాల విషయంలో కొద్ది నెలలుగా లైట్స్మెన్ పోరాటం చేస్తున్నారు. ఎగస్ట్రా షిఫ్టుల్లో పనిచేస్తున్నా జీతాలు- బేటాలూ ఇవ్వడం లేదన్నది వాళ్ల వాదన. అంతేకాదు.. కొన్నేళ్లుగా తమ వేతనాలు ఒకేలా ఉన్నాయని, వాటిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల సమ్మె నోటీసు కూడా పంపారు. దాంతో నిర్మాతలు దిగివచ్చారు. త్వరలో 25 శాతం వరకూ వేతనాలు పెంచుతామని మాట ఇచ్చి.. సమ్మె జరక్కుండా ఆపారు. అయితే ఇప్పుడు కేవలం 12 శాతమే పెంచారట. దీనిపై లైట్స్మెన్ మళ్లీ తమ నిరసన వ్యక్తం చేయడం మొదలెట్టారు. మరోసారి సమ్మెకి పిలుపు ఇవ్వడంతో.. ఈరోజు నిర్మాతలమండలితో కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఇరు వర్గాల వారికీ రాజీ కుదర్లేదని తెలుస్తోంది. లైట్స్మెన్ గనుక సమ్మెకు దిగితే.. షూటింగులు ఆగిపోవడం ఖాయం.