శ్రీరెడ్డి వివాదం చిత్రసీమలో కలకలం పుట్టించింది. కాస్టింగ్ కౌచ్ ఎంత బలంగా ఉందో.. శ్రీరెడ్డి ఉదంతం చాటి చెప్పింది. శారీరకంగా వాడుకుంటే తప్ప అవకాశాలు రావని, అవసరాలు తీర్చుకున్న తరవాత నిర్దాక్షణ్యంగా వదిలేస్తారని చెప్పడానికి శ్రీరెడ్డి ఓ పెద్ద ఉదాహరణ. శ్రీరెడ్డి ఎప్పుడైతే రోడ్డెక్కి అర్థనగ్న ప్రదర్శన చేసిందో అప్పుడు జాతీయ మీడియా కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై ఇప్పటి వరకూ నోరు మెదపని తెలుగు చిత్రసీమపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రసీమ స్పందించింది. ఇండ్రస్ట్రీలో జరుగుతున్న ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో 20 మంది సభ్యులు ఉంటారు. చిత్రసీమకు చెందిన వాళ్లు పదిమంది, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు మరో పదిమంది ఈ కమిటీలో ఉంటారు. పరిశ్రమకు చెందిన వాళ్లెవరైనా తమ సమస్యల్ని.. ఈ కమిటీ కి ఫిర్యాదులు అందించవచ్చు. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారన్నది అతి త్వరలో చెబుతామని చిత్రసీమ ప్రకటించింది.