కరోనా మహమ్మారి రోజు రోజుకీ విశ్వరూపం దాలుస్తుండడంతో… మేలోనూ పరిస్థితులు చక్కబడలేదు. ఎక్కడ చూసినా లాక్ డౌన్, కర్ఫ్యూ వాతావరణమే. ఇలాంటి దశలో సినిమాల గురించి ఆలోచించడం ఆత్యాసే. కానీ సినీ ప్రియులకు ఓటీటీ రూపంలో మంచి వినోద సాధనం దొరికింది. థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేకపోయినా – ఇంటి పట్టున ఉంటూ వినోదాలు ఆస్వాదించగలుగుతున్నారు. మేలోనూ.. టాలీవుడ్ కి ఓటీటీనే పెద్ద దిక్కయ్యింది. ఈనెలలో కనీసం వారానికి ఒక సినిమా చొప్పున ఓటీటీలో సందడి చేశాయి. దాంతో కాస్తయినా కాలక్షేపం దొరికింది.
7న అనసూయ నటించిన `థ్యాంక్యూబ్రదర్` ఆహాలో విడుదలైంది. అనసూయ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకి మంచి రేటే పలికింది. ఎమోషన్ కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. కానీ ఆ ఎమోషనే పండలేదు. దాంతో.. అనసూయ కష్టం వృధా అయ్యింది. ఆ తరువాతి వారం నెట్ ఫ్లిక్స్ లో `సినిమా బండి` వచ్చింది. ఇందులో స్టార్లు లేరు. కనీసం తెలిసిన మొహాలూ లేవు. అయితేనేం.. కావల్సినంత వినోదం పండించింది. ప్రతి ఒక్కరిలోనూ ఓ సినిమా మేకర్ ఉంటాడన్న విషయాన్ని అందర్లీనంగా ఈ సినిమా చెప్పింది. ఆ చెప్పే విధానం కొత్తగా, వినోదాత్మకంగా సాగింది. దాంతో సినిమా బండికి మంచి రివ్యూలొచ్చాయి. ప్రశంసలు దక్కాయి. జీ 5లో వచ్చిన `బట్టల రామస్వామి బయోపిక్`కీ మంచి మార్కులే పడ్డాయి. ఇది కూడా… వినోదాన్ని నమ్ముకున్న సినిమానే. ఇందులోనూ స్టార్లు లేరు.కొత్త వాళ్లతో తీసిన ఈ రెండు చిత్రాలూ ఓటీటీలకు ఊరటనిచ్చాయి.
అమేజాన్ లో విడుదలైన `ఏక్ మినీ కథ`పై అందరి దృష్టి పడింది. ఇదో బోల్డ్ కాన్సెప్టుతో తీసిన సినిమా. యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ నుంచి రావడంతో అమేజాన్ మంచి రేటు ఇచ్చి ఈ సినిమా కొనేసింది. ఓరకంగా పక్కా ఓటీటీ సినిమా ఇది. మహిళలకు, పెద్దవాళ్లకూ ఈ కాన్సెప్ట్ అతిగా అనిపించొచ్చు గానీ, కుర్రాళ్లు మాత్రం ఆస్వాదించేస్తున్నారు. థియేటర్లో విడుదలైతే.. జనాలు చూసేవాళ్లో లేదో గానీ, ఓటీటీలో మాత్రం హిట్టు కిందే లెక్క, ఇక ఆహాలో విడుదలైన `అనుకోని అతిథి` లోనూ మెరుపుల్లేవు. సాయి పల్లవి, సాజిద్ లాంటి స్టార్లు ఉన్నా, ఈ థ్రిల్లర్ మెప్పించలేకపోయింది.
జూన్‌లోనూ కొన్ని సినిమాలు ఓటీటీలోనే దర్శనమివ్వబోతున్నాయి. కొన్ని చిత్రాలు ఇప్పటికే ఒప్పందాలు చేసేసుకున్నాయి. మరికొన్ని ఆ బాటలో ఉన్నాయి. `దృశ్యమ్ 2`లాంటి పెద్ద సినిమాలూ ఓటీటీలోనే రాబోతున్నాయన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీటిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.