మొన్నటి వరకూ ఎన్నికల ఫీవర్ తో వణికిపోయారు తెలుగు ప్రజలు. దాంతో సినిమాల గురించి పెద్దగా పట్టించుకొనే సమయం దొరకలేదు. బాక్సాఫీసు ముందుకు చిన్నా, చితకా సినిమాలు వచ్చినప్పటికీ వాటికి ఆదరణ కరువైంది. దాంతో థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈవారం మళ్లీ థియేటర్లు తెరచుకొంటున్నాయి. ‘లవ్ మి’, ‘రాజు యాదవ్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రేక్షకుల మూడ్ మారిందా, లేదా? అనేది తెలుసుకోవడానికి ఈవారం ఓ సమీక్షలా ఉపయోగపడబోతోంది.
దిల్ రాజు సంస్థ నుంచి వస్తున్న సినిమా ‘లవ్ మి’. ఆశీష్ కథానాయకుడు. కీరవాణి, పి.సి.శ్రీరామ్ లాంటి టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేయడం విశేషం. హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కాన్సెస్ట్ కాస్త వైవిధ్యంగా కనిపిస్తోంది. దెయ్యాన్ని ఓ యువకుడు ప్రేమిస్తే ఏం జరిగిందన్నదే కథ. లవ్ స్టోరీల్లో ఇదో కొత్త ట్రెండ్ అనుకోవొచ్చు. దిల్ రాజు సినిమా కాబట్టి, ప్రచారం కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. మరోవైపు జబర్దస్త్ తో పాపులర్ అయిన గెటప్ శ్రీను హీరోగా మారాడు. తను నటించిన సినిమా ‘రాజూ యాదవ్’. మొహానికి బంతి తగలడం వల్ల.. స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ అలానే ఉండిపోయిన ఓ కుర్రాడి కథ ఇది. ప్రతీదానికీ అలా నవ్వులు చిందిస్తూనే ఉంటాడు. దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది తెరపై చూడాలి. జబర్దస్త్ నుంచి వచ్చిన సుడిగాలి సుధీర్ హీరోగా చేస్తున్నాడు. తన ‘గాలోడు’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. గెటప్ శ్రీను జాతకం ఎలా ఉందో చూడాలి.
అయితే ఈ వారం ఐపీఎల్ ప్లే ఆఫ్స్ హడావుడి మొదలవుతుంది. కీలకమైన మ్యాచ్‌లు, అందులోనూ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరింది కాబట్టి సాయింత్రం అయితే కుర్రాళ్లంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇలాంటి తరుణంలోనూ జనాలు థియేటర్లకు వస్తారా, అనేది వేచి చూడాలి.