రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుందని ఒక్క రోజు ముందు అది కూడా పదిహేను గంటల ముందు మాత్రమే ఖరారైంది. సినిమా వాళ్లు అంటేనే ఎక్కడెక్కడ ఉంటారో చెప్పడం కష్టం. సమావేశాలు ఏదైనా వారం ముందు డిసైడ్ చేస్తేనే అందరూ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ తో భేటి గురించి కొన్ని గంటల ముందే చెప్పినా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా తరలివచ్చారు. చిరంజీవి ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో ఆయన రాలేకపోయారు. అదొక్కటే లోటు. మిగతా కీలక నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్టివ్ గా సినిమాలు తీస్తున్న భారీ నిర్మాతలంతా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు, నటులు కూడా హాజరయ్యారు. ఇది రేవంత్ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇచ్చిన ప్రాధాన్యత అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో ప్రభుత్వాన్ని గౌరవించకపోతే మరిన్ని సమస్యలు వస్తాయని చాలా మంది వచ్చారు. ఈ సమావేశం లాంఛనమేనని తర్వాత మరిన్ని ప్రతిపాదనలో మరింత విస్తృతమైన సమావేశాన్ని టాలీవుడ్ నిర్వహించి ముఖ్యమంత్రిని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం తర్వాత టాలీవుడ్ , ప్రభుత్వం మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వరకూ పరిష్కారం అవుతుందన్న అంచనాలో ఉన్నారు. ప్రభుత్వం రిసీవ్ చేసుకున్న విధానం కూడా బాగుందని అనుకుంటున్నారు. మొత్తంగా సమావేశం అటు టాలీవుడ్, ఇటు ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లుగా జరిగిందని అనుకోవచ్చంటున్నారు.