టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ 20వ తేదీన అపాయింట్మెంట్ ఇచ్చారని టాలీవుడ్ టాప్ హీరోలంతా వచ్చి సమావేశం అవుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ రోజున మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని అధికారికంగా ఓ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సినిమాటిక్కెట్ల అంశంపై పరిశ్రమలోని వివిధ వర్గాలు.. వివిధ వ్యాపార విభాగాల పెద్దలతో పేర్ని నాని సమావేశం అవుతారని.. దీనికి ఫిల్మ్ డెలవప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయచందర్ కూడా హాజరవుతారని అంటున్నారు.
జగన్తో సినీ పెద్దలు భేటీ అవుతారన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇటీవల మీడియాతో మాట్లాడిన పేర్ని నాని త్వరలో సీఎంతో సినీ పెద్దల భేటీ ఉంటుందని చెప్పారు కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు. అదే సమయంలో టిక్కెట్ల అంశంపై భేటీ ఉంటుందని అన్నారు. ఆ భేటీ పేర్ని నానితో అని ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఇటీవల ప్రభుత్వం టిక్కెట్లను అమ్మాలని నిర్ణయించుకుంది. ఆ అంశంపై అభిప్రాయాలు సేకరించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్న దానిపై స్పష్టత లేదు సీఎంతో సమావేశం అంటే చిరంజీవి సహా టాలీవుడ్ పెద్దలుగా భావించేవారు హాజరయ్యే అవకాశం ఉంది. కానీ పేర్ని నానితో భేటీకి ప్రత్యేకంగా విజయవాడ వెళ్లడానికి చిరంజీవి సిద్ధంగా ఉంటారా అన్నది సందేహమే. టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మాలని సినీ పెద్దలే కోరినట్లుగా పేర్ని నాని చెప్పారు. తామే కోరామని కానీ.. కోరలేదని కానీ వారు ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరవయ్యో తేదీన దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.