జగన్ సీఎం అవడం సినీ పరిశ్రమ పెద్దలకు ఇష్టం లేదని.. అందుకే ఎవరూ ఆయనను కలిసి అభినందించలేదని.. గతంలో ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ విమర్శలు చేశారు. ఆయన కమెడియన్ కాబట్టి.. అందరూ కామెడీగానే తీసుకున్నారు. ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు సిని పరిశ్రమ మొత్తం… జగన్‌ను కలిసేందుకు వెళ్తోంది. ఎజెండా షూటింగ్‌లకు అనుమతులు..ధియేటర్ల ప్రారంభోత్సవాలు మాత్రం కాదు. ఏపీలో చిత్రపరిశ్రమను కేంద్రీకరించడం. షూటింగ్‌లకు తెలంగాణ సర్కార్.. నిన్న అనుమతి ఇచ్చి ఉండవచ్చు కానీ.. ఏపీ సర్కార్ మాత్రం.. రెండు వారాల కిందటే పర్మిషన్ ఇచ్చేసింది. సింగిల్ విండో అనుమతులు కూడా ఓకే చేసింది. ధియేటర్లు ప్రారంభం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి.. ఈ రెండు అంశాలపై కాకుండా.. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపైనే టాలీవుడ్ బృందం జగన్‌తో చర్చించడానికి వెళ్తుందని భావించాల్సి ఉంటుంది.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, పరిశ్రమను ఆదుకోవటం వంటి అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. జగన్ తో నిర్వహించే భేటీకి హీరో నాగార్జున, జీవిత, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్, కార్యదర్శి దామోదర ప్రసాద్, నిర్మాత సురేష్ బాబు వంటి తదితరులున్నారు. దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ , రాజమౌళి, కొరటాల శివ, మరికొంత మంది ప్రముఖ దర్శకులు కూడా హాజరు కానున్నారు. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని ఏపీ సర్కార్ చెబుతోంది. ఈ అవకాశాల్ని అంది పుచ్చుకోవాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు.
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వైజాగ్ లో సినిమా స్టూడియోలు, సినీ ల్యాబ్ లు నిర్మాణానికి భూమి కేటాయించాలని సినీ ప్రముఖులు ప్రధానంగా కోరుతారని సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే సీఎం జగన్ కు సినీ ప్రముఖులు లేఖలు కూడా రాసినట్లుగా తెలుస్తోంది. వైజాగ్‌లో స్టూడియోలు నిర్మించాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు.. జగన్‌తో భేటీ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. టాలీవుడ్‌ను హైదరాబాద్ నుంచి తరలించి.. ఏపీలో కేంద్రీకృతమయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఏపీ సర్కార్ ఇచ్చే ఆఫర్లు.. సినీ ప్రముఖులకు నచ్చుతాయో లేదో చూడాలి..!