శుభారంభం సగం విజయం అంటుంటారు పెద్దలు. పని ఏదైనా సరే, సక్రమంగా ఆరంభిస్తే సగం విజయం దక్కినట్టే. శ్రీకారం సరిగ్గా చుట్టుకొంటే విజయ ద్వారాలు తెరచుకోవాల్సిందే. చిత్రసీమ కూడా అదే కోరుకుంటోంది. సంక్రాంతి నుంచి టాలీవుడ్ క్యాలెండర్ మొదలు కానుంది. సంక్రాంతి చాలా కీలకమైన సీజన్. టాలీవుడ్ కు ఇదే అతి పెద్ద సంబరం. కాబట్టి… సంక్రాంతితో ఘనమైన బోణీ కొట్టి 2025కి సాదరంగా స్వాగతం పలకాలని భావిస్తోంది.
జనవరిలో జోరుగానే సినిమాలొస్తాయి. తొలి వారం నుంచే వినోదం మొదలైపోతుంది. అయితే ఈసారి మాత్రం జనవరి తొలి వారంలో పెద్దగా హంగామా కనిపించడం లేదు. ఈరోజు మలయాళ అనువాద చిత్రం ‘మార్కో’ విడుదలైంది. కేరళలో బాగా ఆడిన సినిమా ఇది. కాకపోతే రక్తపాతం ఎక్కువ. తెలుగువాళ్లకు ఎంత వరకూ నచ్చుతుందన్నది ప్రశ్న. డిసెంబరు 31నే ప్రీమియర్ షో వేశారు. సినిమా చూసినవాళ్లంతా ‘ఇంత రక్తపాతం ఏంటో’ అని పెదవి విరుస్తున్నారు. మాస్, యాక్షన్ ప్రియులకు ఈ సినిమాలోని ఫైట్లు నచ్చే అవకాశం ఉంది. 2న త్రిష ప్రధాన పాత్రధారిగా నటించిన ‘ఐడెంటిటీ’ విడుదల కానుంది. ఇది కూడా డబ్బింగ్ బొమ్మే.
జనవరి 10 నుంచి సంక్రాంతి సినిమాలు వరుస కడతాయి. 10న ‘గేమ్ ఛేంజర్’ వస్తోంది. 12న ‘డాకూ మహారాజ్’ విడుదలకు సిద్ధమైంది. 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ కానుంది. మూడింటిపైనా మంచి అంచనాలే ఉన్నాయి. మూడూ డిఫరెంట్ జోనర్లలో సాగే సినిమాలు. మధ్యలో 2 రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి వసూళ్ల విషయంలో, థియేటర్ల పంపకాల విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవొచ్చు. సాధారణంగా సంక్రాంతికి 4 సినిమాల వరకూ అవకాశం ఉంది. ఈసారి మూడే వస్తున్నాయి. కాబట్టి.. మూడింటికీ అడ్వాంటేజ్ వుంది. ప్రీమియర్ల హడావుడి లేకపోవచ్చు కానీ, ఉదయం 4 గంటల ఆటలకు ఆస్కారం ఉంది.
జనవరి 10న గేమ్ ఛేంజర్తో పాటు సోనూసూద్ దర్శకత్వం వహించిన ‘ఫతేహ్’ రానుంది. సోనూసూద్ కి తెలుగులో మంచి ఆదరణ ఉంది. కరోనా సమయంలో తను చేసిన సేవా కార్యక్రమాలతో మనవాళ్లకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక దృష్టితో చూసే అవకాశం ఉంది. సంక్రాంతి ముగిశాక డబ్బింగ్ చిత్రాల హవా ఎక్కువగా కనిపిస్తోంది. 17న కంగనా ‘ఎమర్జెన్సీ’ వస్తోంది.
సంక్రాంతి తరవాత జనవరి 26 మంచి డేట్. ఈ డేట్ ని తెలుగు నిర్మాతలు ఈసారి క్యాష్ చేసుకోవడం లేదు. అయితే హిందీ నుంచి అక్షయ్ కుమార్ నటించిన యాక్షన్ డ్రామా ‘స్కై ఫోర్స్’ వస్తోంది. సన్నీదేవోల్ ‘లాహోర్ 1947’ కూడా జనవరి 26 సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈనెలాఖరుకి షాహిద్ కపూర్ ‘దేవ’ వస్తోంది. ఇది కూడా యాక్షన్ దట్టించిన సినిమానే.