ఓ సినిమా కొబ్బరికాయ్ కొట్టుకోవడం నుంచీ… గుమ్మడి కాయ తో దిష్టి తీసే వరకూ ఎన్ని ఆటుపోట్లో..? రిలీజ్ అయిన ప్రతీ సినిమా హిట్టయినట్టు ఎట్టా కాదో, మొదలైన ప్రతీ సినిమా…. రిలీజ్ అయినట్టూ కాదు. మధ్యలో ఎన్ని గండాలు దాటాలో..? దానికి చిన్న సినిమా – పెద్ద సినిమా అనే తేడా లేదు. చిన్న సినిమాలు గుట్టు చప్పుడు కాకుండా ఆగిపోతుంటాయి. పెద్ద సినిమా ఆగితే మాత్రం అదే…టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది. కాంబినేషన్లు, టైటిళ్లూ ప్రకటించి కూడా కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇంకొన్ని ముందుకా.. వెనక్కా? అని ఆలోచిస్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు రకరకాల కారణాల వల్ల హోల్డ్ లో ఉన్నాయి. ఇంకొన్ని ఎప్పటికీ మొదలు కావని తేలిపోయాయి. అలాంటి సినిమాలపై ఓ లుక్కేస్కే…?
నాగశౌర్య హీరోగా `పోలీస్ వారి హెచ్చరిక` అనే ఓ సినిమా మొదలైంది. టైటిల్, పోస్టర్.. ఇవి కూడా బయటకు వచ్చాయి. కానీ… నిర్మాత హఠాన్మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. అదే నిర్మాత చేయి వేసిన.. అల్లరి నరేష్ `సభకు నమస్కారం` కూడా… అనివార్య కారణాల వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ల `భవదీయుడు భగత్ సింగ్` పై పవన్ అభిమానులు దాదాపుగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమా ఇప్పట్లో ఉండకపోవొచ్చు. ఎప్పుడన్నది అటు పవన్ గానీ, ఇటు హరీష్ గానీ, ఈ సినిమా తీస్తున్న మైత్రీ మూవీస్ గానీ చెప్పలేని పరిస్థితి. గుణశేఖర్ కలల ప్రాజెక్టు `హిరణ్య కశ్యప` అప్ డేట్ ఏమిటన్నది ఇంత వరకూ తెలీదు. రానాతో ఈ సినిమా చేస్తానని ప్రకటించి మూడు నాలుగేళ్లు అయిపోయి ఉంటుంది. అయినా… ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. గుణశేఖర్ ఓ సూపర్ డూపర్ హిట్ కొడితే గానీ… ఈ సినిమా చేయడానికి కావల్సినంత ఉత్సాహం రాదు.
పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్… జనగణమన. టాలీవుడ్ లోని హీరోలంతా ఈ కథ విన్నారు. కానీ.. ఎవరూ ముందుకు రాలేదు. మహేష్ బాబుతో ఓ సినిమా సినిమాని అధికారికంగా ప్రకటించేశారు కూడా. కానీ ఆగిపోయింది. విజయ్ దేవరకొండతో అయితే ఓ షెడ్యూల్ చేశాక పేకప్ చెప్పేశారు. భవిష్యత్తులో అయినా ఈ సినిమా పూర్తవుతుందా, లేదా? అనేది సందేహమే. మంచు మనోజ్ చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు. సుదీర్ఘ విరామం తరవాత `అహం బ్రహ్మస్మి` అనే టైటిల్ తో ఓ పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. కొంతమేర షూటింగ్ కూడా చేశాడు. కానీ బడ్జెట్, తదితర సమస్యల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. పవన్ – క్రిష్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న `హరి హర వీరమల్లు`కి అన్నీ స్పీడు బ్రేకర్లే. రెండు రోజులు షూటింగ్ చేస్తే… రెండు నెలల గ్యాప్ వస్తోంది. ఈసినిమా ఎప్పుడు పూర్తవుతుందన్నది అటు పవన్కీ ఇటు క్రిష్కీ ఫజిలే.
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తయారవుతోంది. ఒక షెడ్యూల్ పూర్తయిందంతే. పూర్తి స్థాయి స్క్రిప్టు లేకపోవడంతో టాకీ పార్ట్ మొదలు కాలేదు.చ ఈ సినిమా ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడుపెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. నితిన్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఓ సినిమా క్లాప్ కొట్టుకొంది. ఈ సినిమాని `జూనియర్` అనే పేరు పరిశీలిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. క్లాప్ కొట్టి నాలుగు నెలలైపోయింది. ఇంత వరకూచ షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పుడు ఈ సినిమా ఉంటుందా, లేదా? అనేది అనుమానం. నాగచైతన్య – పరశురామ్ కాంబినేషన్లో `నాగేశ్వరరావు` అనే పేరుతో ఓ సినిమా మొదలవ్వాల్సింది. కానీ… ఈ సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా `అదిగో.. ఇదిగో` అంటున్నారు తప్ప… ముందుకు జరగడం లేదు. సమంత అనారోగ్యం వల్ల `ఖుషి` సినిమా హోల్డ్ లో పడిపోయింది. సమంత వస్తే గానీ… ఈ సినిమా ముందుకు కదలదు.
కాంబినేషన్ పరంగా, టైటిల్ పరంగా… ఇవన్నీ మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. కానీ కాలం కలసి రావడం లేదంతే. మరి ఈ కథలన్నీ కంచికి చేరేదెప్పుడో…?