బళ్లు ఓడలు అవ్వడం.. ఓడలు బళ్లుగా మారిపోవడం టాలీవుడ్ లో చాలా కామన్. రాత్రికి రాత్రే ఇక్కడ జాతకాలు మారిపోతాయి. అప్పటి వరకూ బీఎండబ్ల్యూలో తిరిగిన `స్టార్`.. తెల్లారేసరికి షేర్ ఆటోకి షిఫ్ట్ అయిపోవడం – అతి మామూలు విషయాలుగా మారిపోయాయి. అయితే నిర్మాతల విషయంలో ఈ తార్ మార్ తక్కడమార్ ఆట మరింత సర్వసాధారణం. అయితే ఓ సంగీత దర్శకుడు ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఐపీ పెట్టే పరిస్థితికి చేరుకొన్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
అతను.. చిన్న సినిమాలకు ‘పెద్ద’ సంగీత దర్శకుడు. బడా మ్యూజికల్ హిట్లు లేవు కానీ.. తన ఆల్బమ్ అంటే పాసైపోతుంది. ఆర్.ఆర్‌లోనూ తనకు పట్టుంది. అందుకే… వరుసగా అవకాశాలు వచ్చాయి. చూస్తుండగానే 80-90 సినిమాలు పూర్తి చేశాడు. చేతి నిండా సంపాదించాడు. అయితే అక్కడి వరకూ ఆగితే బాగుణ్ణు. మిగిలిన వ్యాపకాలు, వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. 3 థియేటర్లని లీజ్‌కి తీసుకొన్నాడు. 3 సినిమాలు తీశాడు. అందులో ఓ సినిమా విడుదలై ఫ్లాప్ అయ్యింది. మరో సినిమా పూర్తయినా.. విడుదల కాలేని పరిస్థితి. ఇంకో సినిమా మొదలై ఆగిపోయింది. చేతిలో డబ్బులు అయిపోయాయి. అప్పులు పెట్టాడు. అప్పులు, వడ్డీలు కలిపి రూ.12 కోట్లయినట్టు తేలింది. మెల్లగా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతానికైతే చేతిలో సినిమాలేం లేవు. దాంతో వడ్డీలు కట్టేందుకు కూడా కష్టమైయింది. అంతెందుకు తన దగ్గర పని చేసిన లిరిసిస్టుల దగ్గర చేబదులు అడిగే పరిస్థితి వచ్చిందని టాక్. ఈమధ్యే అప్పుల వాళ్లు.. శ్రీనగర్ కాలనీలోని ఈ సంగీత దర్శకుడి స్టూడియోపై దాడి చేసి, పెద్ద గొడవ చేసిశార్ట. అదీ ఈ సంగీత దర్శకుడి దీన గాథ. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించే టాలీవుడ్ జనాలు ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారు. ఎలాంటివాడు ఎలా అయిపోయాడా..? అని. ఆ సినిమాలు తీయకపోతే, ఆ థియేటర్లు లీజ్ కి తీసుకోకపోతే.. ఈ దుస్థితి వచ్చేదే కాదు.