దిగ్గజ గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి అంతటా ఆందోళన వ్యక్తం అవుతోంది. బాలు అభిమానులు.. సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. తమిళ సినీ రంగం సామూహిక ప్రార్థనలు చేయాలని పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా రజనీ, కమల్, భారతీరాజా లాంటివాళ్లంతా.. నిన్న (గురువారం) రాత్రి 6 గంటలకు.. తమకు ఇష్టమైన బాలు పాట పాడుతూ… బాలుకి, బాలు కుటుంబానికీ మానసిక స్థైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు.
కానీ… తెలుగు చిత్రసీమ నుంచి ఇలాంటి ప్రయత్నమే జరగలేదు. ఆర్పీ.పట్నాయక్ పిలుపు ఇచ్చి.. సామూహిక ప్రార్థనల పరంపరకు శ్రీకారం చుట్టినా, మనవాళ్లు స్పందించినట్టు ఎక్కడా లేదు. బాలు బాషాబేధం లేని గాయకుడు. గొప్ప కళాకారుడు. కానీ.. మన తెలుగువాడు. తెలుగు చిత్రసీమ నుంచి బాలుకి ఎలాంటి సంఘీభావం ప్రకటించలేదు. దేవిశ్రీ ప్రసాద్, తమన్, కోటి, కీరవాణి… ఇలాంటి సంగీత దర్శకులంతా.. ఇప్పటి వరకూ మౌనంగానే ఉన్నారు. బాలు అంటే ప్రాణం ఇచ్చే మనో సైతం.. బాలు ఆరోగ్యం గురించి ఇప్పటి వరకూ స్పందించలేదు. బాలు ఆసుపత్రి ఖర్చంతా తామే భరిస్తామని తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. బాలు ఆసుపత్రి బిల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో లేరు. కానీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అది. మరి మనవాళ్లేం చేస్తున్నట్టు..? చిరంజీవి మినహాయిస్తే.. పెద్ద స్టార్లెవరూ… బాలు విషయంపై స్పందించలేదు. వీళ్లేదో.. స్పందిస్తే, బాలు ఆరోగ్యం కుదుట పడుతుందో, బాగుపడుతుందనో కాదు. ఓ కళకారుడు ప్రాణాలతో పోరాడుతుంటే, `మీ వెనుక మేమున్నాం` అంటూ ఆ కళాకారుడి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరో కళాకారుడికి తప్పకుండా ఉంటుంది.