ఓ పెద్ద సినిమా వస్తోందంటే – బాక్సాఫీసుతో పాటు, మిగిలిన సినిమాలు ఎలెర్ట్ అయిపోతాయి. అందులోనూ స్టార్ హీరో సినిమా అంటే, మిగిలిన సినిమాలు సైలెంట్ మోడ్ లోకి వెళ్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. ఈనెల 27న `కల్కి` వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకొన్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల రోజుల ముందు నుంచే `కల్కి` హడావుడి ప్రారంభమైపోయింది. 26 అర్థరాత్రి నుంచే ప్రీమియర్లు పడిపోతాయి. అందుకే ‘కల్కి’ రాక కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా, మొత్తం సినీ ప్రియులు వెయిటింగ్ లో ఉన్నారు.
‘కల్కి’ ప్రభావంతో వారం ముందుగానే బాక్సాఫీసు ఖాళీ అయిపోయింది. గతవారం ఆరు సినిమాలు వచ్చాయి. ఈవారం మరో 3 సినిమాలు రెడీ అయ్యాయి. కానీ అన్నీ చిన్నా చితకా సినిమాలే. కేవలం థియేటర్లు దొరకితే చాలు, అదే పది వేలు అనుకొనే కొన్ని సినిమాలు ఈవారం విడుదలకు సిద్ధమయ్యాయి. నింద, ఓ.ఎం.జీ, హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై ఎవరికీ ఏమాత్రం అంచనాలు లేవు. ప్రమోషన్ల పరంగానూ ఈ చిత్రాలు స్పీడు చూపించడం లేదు. థియేటర్‌కి వెళ్లి చూడాల్సిందే అనేంత కంటెంట్ .. ఈ సినిమాల్లో కనిపించడం లేదు. గత వారం చాలా సినిమాలొచ్చినా ‘మహారాజ’కు మాత్రమే వసూళ్లు దక్కాయి. ఈవారం కూడా అదే పెద్ద దిక్కుగా మారే అవకాశం ఉంది. ఈనెల 27న ‘కల్కి’ ఎలాగూ వస్తోంది. `కల్కి` తరవాతి వారం కూడా తెలుగులో కొత్త సినిమాల హడావుడి కనిపించకపోవొచ్చు. అంటే… ‘కల్కి’కి ముందూ, ఆ తరవాత కూడా బాక్సాఫీసు ఖాళీనే. ‘కల్కి’ స్టామినా చూశాకే, మిగిలిన సినిమాలు తమ విడుదల తేదీలు, ప్రమోషన్లు ప్లాన్ చేసుకొంటాయి.