2020 ఓ బ్లాక్ ఇయర్. అన్ని విధాలుగానూ. ముఖ్యంగా టాలీవుడ్ 2020లో తీవ్రంగా నష్టపోయింది. సినిమాల కళ లేదు. ఎక్కడికక్కడ షూటింగులు ఆగిపోయి, నిర్మాతలతో పాటు అన్ని రంగాల వాళ్లూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 2021లో వడ్డీతో సహా వసూలు చేసుకోవాలన్న ధోరణి కనిపించింది. ఇప్పుడు దానికి తగ్గ ఫలితాలు వస్తున్నట్టే కనిపిస్తోంది.
జనవరిలో క్రాక్ సూపర్ హిట్టయ్యింది. ఫిబ్రవరిలో ఆ బాధ్యత ఉప్పెన తీసుకుంది. ఇప్పుడు మార్చి వచ్చింది. ఈ నెలలో… జాతి రత్నాలు సూపర్ హిట్టయ్యింది. నెలకో సూపర్ హిట్టు వచ్చిపడడంతో.. టాలీవుడ్ కళే మారిపోయింది. ఉప్పెన. జాతిరత్నాలు లాంటి చిన్న సినిమాలు ఆడడం – టాలీవుడ్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎందుకంటే.. చిన్న సినిమాలకు ఇలాంటి విజయాలే ఊపిరి పోస్తాయి. మరో పది మంది కొత్త నిర్మాతలు చిన్న సినిమాలు చేయడానికి రెట్టించిన హుషారుతో బరిలోకి దిగుతారు. దాంతో.. చిత్రసీమలోని ప్రతి ఒక్కరికీ పని దొరుకుతుంది. ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో విరివిగా కొత్త సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 70 సినిమాలు.. క్లాప్ కొట్టుకున్నాయి. ఇది నిజంగా శుభపరిణామం.
మొత్తానికి 2021 ప్రారంభం బాగుంది. తొలి త్రైమాసికంలో బాక్సాఫీసు జోరు చూపించింది. ఈనెలలోనే `చావు కబురు చల్లగా`, `అరణ్య`, `మోసగాళ్లు` వరుసలో ఉన్నాయి. వీటిలో ఒక్కటి హిట్టయినా – మార్చికి మంచి ముగింపు దక్కినట్టే. రాబోయే మూడు నెలల్లోనూ మంచి సినిమాలే వస్తున్నాయి. ఏప్రిల్ లో వకీల్ సాబ్.. వాదన చూడొచ్చు. పవన్ కల్యాణ్ సినిమా అంటే.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. తనకు ఓ యావరేజ్ పడినా బాక్సాఫీసు షేక్ అయిపోతుంది. హిట్టయితే… వంద కోట్ల మార్క్ అందుకోవడం నల్లేరుపై నడక. వరుసగా మూడు నెలల్లో మూడు సూపర్ హిట్లు చూసిన టాలీవుడ్ వకీల్ సాబ్ పైనా భారీగా నమ్మకాలు పెట్టుకుంది. ఏప్రిల్ లోనే టక్ జగదీష్, లవ్ స్టోరీ లాంటి క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిపైనా మంచి అంచనాలు ఉన్నామయి. మేలో ఆచార్య, నారప్పతో పాటు బాలకృష్ణ సినిమా కూడా ఉంది. రవితేజ `ఖిలాడీ`కూడా మేలోనే విడుదల అవుతోంది.
ఎలా చూసినా రాబోయే మూడు నెలలు కూడా బాక్సాఫీసు ఇదే జోష్ నిచూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నెలకో హిట్టు పడినా – 2021 మంచి ఫలితాల్ని ఇచ్చినట్టే. మధ్యమధ్యలో జాతిరత్నాలు లాంటి చిన్న సినిమాలు ఊహించని విజయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తే అంతకంటే కావల్సింది ఏముంది?