ఏప్రిల్ 14 అయిపోయింది.
ఇప్పుడు మే 3 వరకూ ఆగాలి.
అనుకున్నదంతా అయ్యింది. లాక్ డౌన్‌ని పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే 3 వరకూ ఎక్కడివాళ్లక్కడే గప్ చుప్. ఈ సమయంలో ఇంతకంటే సురక్షితమైన నిర్ణయం లేకపోవొచ్చు. కానీ.. లాక్ డౌన్ ఎత్తేస్తారేమో అని ఎదురుచూసిన కీలకమైన రంగాలకు భంగపాటు మాత్రం తప్పలేదు. అందులో చిత్రసీమ కూడా ఉంది. లాక్ డౌన్ ఎత్తేస్తారన్న ఆశలు ఎవరికీ లేవు గానీ, కనీసం కొన్ని మినహాయింపులు లభిస్తాయనుకున్నారు. ఇప్పుడు అదీ లేదు.
మే 3 వరకూ చిత్రసీమ కార్యక్రమాలన్నీ స్థంభించిపోయినట్టే. ఆ తరవాత ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ 3న లాక్డౌన్ ఎత్తేసినా, అది కూడా దశలవారిగానే ఉండే ఛాన్సుంది. మాల్స్. థియేటర్లకు అంత త్వరగా అనుమతులైతే లభించవు. అంటే.. మే పై కూడా దాదాపుగా ఆశలు వదిలేసుకోవచ్చు. సినిమా విడుదల అనే ఆలోచన రావడానికే టాలీవుడ్‌కి చాలా టైమ్ పట్టేట్టు ఉంది. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఓటీటీ సంస్థలు కాపుకాచుకుని కూర్చున్నాయి. సినిమాలు పూర్తయి, రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న వాటిపై ఓటీటీ గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్సీ రేట్లు ఆశ చూపిస్తున్నా, చాలా సినిమాలు లొంగలేదు. `థియేటర్లలో విడుదల చేస్తాం` అని మంకి పట్టుపట్టుకుని కూర్చున్నాయి. ఇప్పుడు ఆయా నిర్మాతలంతా కరగక తప్పదు. సినిమా పూర్తయి, మరో నాలుగైదు వారాల పాటు నిరీక్షించడం అంటే కత్తి మీద సామే. ఇప్పటికే నిరీక్షణ ఎక్కువైంది. జూన్ వరకూ ఆగాలంటే… వడ్డీల మోత భరించడం కష్టం అవుతుంది. అందుకే…. ఈసారి మాత్రం ఓటీటీవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
వాటి మాటెలా ఉన్నా, షూటింగులు మొదలైతే బాగుణ్ణు అనుకున్న కార్మిక లోకం మాత్రం – ప్రధాని ప్రకటనతో నీరసపడిపోయింది. జూనియర్ ఆర్టిస్టులు, లైట్స్మెన్.. ఇలా వందల మందికి ప్రధాని ప్రకటన ఆకలి బాధని మిగిల్చింది. ఇంటికే పరిమితమైన హీరోలు, హీరోయిన్లు… ఇంతకొంత కాలం – కాలు బయటపెట్టడానికి వీల్లేకుండా పోయింది. ఈ బాధలు ఇంకెన్నాళ్లో మరి.