నందమూరి బాలకృష్ణకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రముఖులంతా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఆయన్ని ఘనంగా సన్మానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ యువ నిర్మాత బాలయ్య సన్మాన సభకు కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
నిజానికి ఇలాంటి కార్యక్రమాలు చిత్రసీమ అంతా ఏకమై నిర్వహిస్తే బాగుంటుంది. చిరంజీవికి పద్మభూషణ్ వచ్చినప్పుడు చిత్రసీమ ఘనంగా సన్మానించింది. అయితే పద్మ విభూషణ్ ప్రకటించినప్పుడు ఎలాంటి హడావుడీ జరగలేదు. ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. చిత్రసీమ చేసినా చేయకపోయినా, ఓ నిర్మాత బాలయ్యని సన్మాన కార్యక్రమానికి నడుం బిగించాడు. ఇది సంతోషించదగిన విషయమే.
బాలయ్య వేడుకకు అతిథులు ఎవరొస్తారన్న ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బాలయ్య సమకాలికులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ కార్యక్రమానికి వస్తే ఆ కళే వేరుగా ఉంటుంది. ఎన్టీఆర్ కూ బాలయ్యకూ మధ్య ఓ గ్యాప్ ఉందన్నది అభిమానులు సైతం ఒప్పుకొనే విషయం. అయితే బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించినప్పుడు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. `బాబాయ్`కు శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడు అదే చొరవతో ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ని కూడా ఆహ్వానిస్తే ఆ గ్యాప్ కాస్త ఫిల్ అయిపోతుంది. నిజంగానే చిరు, నాగ్, వెంకీలతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు వస్తే గనుక… ఈ కార్యక్రమం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోతుంది. మరి.. బాలయ్య మనసులో ఏముందో?!