నిర్మాత, డిస్టిబ్యూటర్ కె.పి.చౌదరి ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన కొంతకాలంగా గోవాలో ఉంటున్నారు. అక్కడే ఆత్మహత్య చేసుకొన్నట్టు సమాచారం అందుతోంది. ‘కబాలి’ సినిమాని తెలుగులో విడుదల చేశారు చౌదరి. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్ని పంపిణీ చేశారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. నిర్మాణంలో చాలా నష్టాలొచ్చాయి. ఆ తరవాత గోవా వెళ్లి అక్కడ ఓ పబ్ పెట్టారు. అది కూడా కలసి రాలేదు. అక్రమంగా పబ్ పెట్టారన్న అభియోగాలతో గోవా ప్రభుత్వం ఆ పబ్‌ని కూల్చి వేసింది.
ఆ తరవాత.. డ్రగ్స్ సరఫరా చేస్తూ అధికారులకు పట్టుబడ్డారు కె.పి.చౌదరి. అక్కడ నుంచి ఆయన జీవితం కటకటాల పాలైంది. ఈ కేసు ప్రస్తుతం నడుస్తోంది. బెయిల్ పై బయటకు వచ్చిన కె.పి.చౌదరి గోవా వెళ్లిపోయారు. కొంతకాలంగా ఆయన ఆర్థిక ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటున్నారు. చివరికి ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సివచ్చింది. చౌదరి మృతికి కారణం ఆర్థిక వ్యవహారాలేనా, మరేమైనా ఉన్నాయా? అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.