సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి, సినిమా గురించి మాట్లాడుకొనేలా చేయడానికి ‘ప్రచారం’ చాలా అవసరం. అందుకే పబ్లిసిటీ విషయంలో దర్శక నిర్మాతలు చాలా తిప్పలు పడుతుంటారు. దానికంటూ కొంత బడ్జెట్ కేటాయించడం పరిపాటే. అయితే ఇప్పుడు తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసమే కాదు, పక్క సినిమాని ట్రోల్ చేయడానికి కూడా బడ్జెట్ అవసరం అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న వికృత ట్రెండ్ ఇది.
సోషల్ మీడియా బాగా విస్తరించింది. మీమ్స్ పేజీలకు మంచి డిమాండ్ ఉంది. వాళ్లలో చాలామంది స్వచ్చందంగా తమకు అనిపించిన విషయాలపై స్పందిస్తుంటారు. తమ క్రియేటివిటీ ఉపయోగించి కొన్ని సినిమాల్ని ట్రోల్ చేస్తారు. వాటితోనే వీక్షకులకు వినోదం పంచిపెడతారు. ఇదంతా ఆర్గానిక్ వ్యవహారం. వీటికి పాపులారిటీ పెరగడంతో ‘మా సినిమాని ప్రమోట్ చేయండి’ అంటూ నిర్మాతలే మీమర్స్ కి కొంత ‘పే’ చేయడం మొదలైంది. వాళ్లంతా సినిమాని ‘ఆహా..’, ‘ఓహో’ అంటూ బిల్డప్ ఇస్తూ ప్రమోట్ చేస్తారు. ఇది కూడా కొంత వరకూ ఓకే. పబ్లిసిటీలో దాన్ని కూడా భాగంగా చూడాలి. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ‘మా సినిమాని ప్రమోట్ చేయకపోయినా ఫర్వాలేదు.. పక్క సినిమాని ట్రోల్ చేయండి చాలు’ అంటూ మీమర్స్ ని సంప్రదిస్తున్నారు. వాళ్లంతా టీజర్, ట్రైలర్ రాగానే.. వాటిపై పడిపోతున్నారు. టీజరే ఇలా ఉంటే, సినిమా ఎలా ఉంటుందో అనే రేంజ్లో ప్రేక్షకుల్ని భయపెడుతున్నారు. గత ఏడాది ఓ పెద్ద సినిమా విడుదలైంది. అందులో విజువల్స్ కాస్త చీప్‌గా కనిపించాయి. దాని చుట్టూ బోలెడన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఇందులో సగం ఆర్గానిక్‌గా వచ్చాయి. మిగిలిన సగం వెనుక ఓ పెద్ద మనిషి ఉన్నాడని టాక్. తనే.. మీమ్స్ పేజీలకు డబ్బులిచ్చి మరీ సదరు సినిమాపై పెయిడ్ ట్రోలింగ్ సృష్టించాడు.
ఆమధ్య మంచు విష్ణు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తనపై, తన కుటుంబంపై భారీ ట్రోలింగ్ జరుగుతోందని, కొంతమంది డబ్బులిచ్చి మరీ తమని ట్రోలింగ్ కి గురి చేస్తున్నారని వాపోయాడు. విష్ణుపై ఫోకస్ చేసి, ట్రోల్ చేయడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టడం కాస్త టూ మచ్ వ్యవహారమే. కానీ ఇలాంటి పోకడ మాత్రం ఇండస్ట్రీలో ఉంది. తమకు పోటీ వస్తున్న సినిమాలపై, లేదంటే తమకు పోటీ వస్తున్న హీరోల సినిమాలపై విరుచుకుపడిపోవడానికి ట్రోలర్స్‌కి భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. పక్కవాళ్ల పై బురద జల్లడానికి ప్రయత్నిస్తే, ముందు తమ చేతులు మురికి అవుతాయి. ఆ శ్రద్ద ఏదో.. తమని తాము ఉద్ధరించుకోవడానికి పెడితే.. బాగుంటుంది. డబ్బులూ కలిసొస్తాయి. ఈ విషయం వీళ్లకు ఎప్పుడు అర్థం అవుతుందో..?