దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో… కేంద్రం మళ్లీ నిబంధనల్ని కఠినతరం చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థల్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించాయి. మెల్లగా… థియేటర్ల వైపు కూడా దృష్టి సారించే అవకాశాలున్నాయి. కరోనా తరవాత.. ఇప్పుడిప్పుడే చిత్రసీమ పుంజుకుంటోంది. ఇప్పుడు మళ్లీ థియేటర్లను మూసేస్తే.. చిత్రసీమ మరింతగా కృంగిపోతుంది. అయితే.. పూర్తి స్థాయిలో థియేటర్లను మూసేసే అవకాశం లేదు గానీ, కనీసం 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకునే అవకాశం ఇవ్వొచ్చు. అలాగైనా రిస్కే. ఈ వేసవిలో పెద్ద సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధన విధిస్తే.. బడా సినిమాలు ఆగిపోతాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని విడుదల చేసుకునే పరిస్థితిలో ఇప్పుడు ఏ నిర్మాతా లేడు. అన్ లాక్ ప్రక్రియ మొదలైన కొత్తలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపుకోవచ్చని ప్రభుత్వాలు ప్రకటించాయి. అప్పట్లో కూడా.. బడా నిర్మాతలెవరూ సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురుకావొచ్చు.
మరోవైపు మళ్లీ లాక్ డౌన్ ప్రకటిస్తారేమో అనే భయాలు చిత్రసీమను వెంటాడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలు ఈ విషయంలో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. `వకీల్ సాబ్` నుంచి పెద్ద సినిమాల తాకిడి మొదలవుతుంది. ఆ తరవాతి నుంచి వరుసగా.. బడా సినిమాలే రాబోతున్నాయి. మే లో అయితే ఆచార్య, నారప్ప, బాలయ్య సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నింటికీ… ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. అంతేకాదు… నిన్నా మొన్నటి వరకూ టాలీవుడ్ లో షూటింగులు యమ స్పీడుగా జరిగాయి. కొత్త సినిమాలు విరివిగా మొదలయ్యాయి. అయితే కొన్ని రోజుల నుంచి ఆ హడావుడి బాగా తగ్గింది. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమో అన్న భయాలతోనే కొత్త సినిమాలు మొదలెట్టడం లేదన్నది ట్రేడ్ వర్గాల మాట.