ఇటు నిర్మాతలకూ, అటు క్యూబ్, యూఎఫ్ఓ ఆపరేట్లకు మధ్య… అద్దె వసూళ్లపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్యూబ్, యూఎఫ్ ఓ కంపెనీలు తమ దగ్గర నుంచి భారీ ఎత్తున అద్దెలు వసూలు చేస్తున్నారని, వాటిని తగ్గించుకోక పోతే… థియేటర్లని బంద్ చేస్తామని గతంలో నిర్మాతలు హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఈరోజు బెంగళూరులో నిర్మాతలకూ, క్యూబ్ ఆపరేటర్లకు మధ్య చర్చలు జరిగాయి. అయితే… ఈ చర్చలు విఫలమవ్వడంతో.. ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. క్యూబ్ అద్దెలు కనీసం 25 శాతానికి తగ్గించాలన్నది నిర్మాతల ప్రతిపాదన. దానికి క్యూబ్ ఆపరేటర్లు ఒప్పుకోలేదు. తగ్గింపు 8.5 శాతం వరకే అని తేల్చేశారు. దాంతో.. థియేటర్ల బంద్కు మరోసారి పిలుపు ఇచ్చారు నిర్మాతలు. మార్చి 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లనీ మూసి వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. మరోసారి.. ఈ చర్చలు జరుగుతాయా? అప్పుడు ఆపరేటర్లు దారిలోకి వస్తారా అనేది తెలియాల్సివుంది. ఈ బంద్ పిలుపుతో… వేసవిలో విడుదల కాబోయే సినిమాలు అయోమయంలో పడ్డాయి.