టికెట్ రేట్లు పెంచుకొంటూ పోవడం వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదని, ఈ కారణంతోనే థియేటర్లు బోసిబోతున్నాయని, అర్జెంటుగా సినిమా టికెట్ రేట్లు తగ్గించాల్సి ఉందని.. నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. కొద్ది రోజులుగా జరుగుతున్న నిర్మాతల సమావేశంలో తీసుకొన్న కీలకమైన నిర్ణయాల్లో ఇదొకటి. ఎంత పెద్ద సినిమా అయినా సరే టికెట్ రేటు (మల్టీప్లెక్స్‌లో) రూ.150 దాటకూడదని కీలకమైన నిర్ణయం తీసుకొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ రేటు అత్యధికంగా రూ.70 గా నిర్ణయించారు. పట్టాణాలలో టికెట్ రేటు.. రూ.100గా ఫిక్సయ్యింది. ఎంత పెద్ద సినిమా వచ్చినా సరే, ఈరేటు మించకూడదని ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఓటీటీల విషయంలోనూ చర్చలు సాగాయి. పెద్ద సినిమాని పది వారాల తరవాతే ఓటీటీకి ఇవ్వాలని, చిన్న సినిమా అయితే 4 వారాలు సరిపోతాయని ఛాంబర్ నిర్ణయించింది. పని వేళలు, కార్మికుల వేతనంపై చర్చ జరిగినా, నిర్మాతలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీని గురించి.. మరో సమావేశంలో నిర్ణయం తీసుకొంటారు. హీరోల పారితోషికాలపై కూడా చర్చ సాగింది. అయితే వాటిని క్రమబద్దీకరించడం కుదరదని కొంతమంది నిర్మాతలు బాహాటంగానే చెప్పేశారు. ”ఓ హీరోకి ఎంత ఇవ్వాలన్నది నిర్మాత ఇష్టం. హీరోల డిమాండ్ మేరకే పారితోషికాలు ఉంటాయి. ‘వాళ్లు ఇంతే తీసుకోవాలి’ అని ఎవరూ చెప్పలేరు.. పెద్ద హీరోల విషయంలో ఈ రూల్ చెల్లుబాటు కాదు” అని ఓ నిర్మాత బాహాటంగానే తన అభిప్రాయం వ్యక్త పరిచినట్టు టాక్. దాంతో… హీరోల పారితోషికాల విషయంలోనూ నిర్మాతలు ఓ అభిప్రాయానికి రాలేకపోయారు.