తామే టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా అమ్మాలని కోరామని పేర్ని నానితో సమావేశం అయిన తరవాత టాలీవుడ్ నిర్మాతలు ప్రకటించారు. ఆదిశేషగిరిరావు, సి.కల్యాణ్ వంటి నిర్మాతలు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పేర్ని నానిసమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ వినోదం అందించేందుకు పారదర్శకత కోసం తాము ఆన్ లైన్ టిక్కెట్ పోర్టల్ ను తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆన్ లైన్లో టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మినా రేట్లు మాత్రం పెంచాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పేర్ని నాని కూడా రేట్లు పెంచుతామన్నట్లుగా మాట్లాడారు.
సినిమాలంటే ఇష్టపడే వారిని దోచుకుంటున్నారన్న భావన రాకుండా.. ప్రజలెవరూ ప్రశ్నించకుండా టిక్కెట్ ధరలను నిర్ణయిస్తామన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలతో మాత్రమే టిక్కెట్లను అమ్మాలని ఆయన స్పష్టం చేశారు. ధియేటర్ల ఖర్చులను ప్రధానంగా పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లి రేట్లు పెంచాలని అడిగినట్లుగా ఆది శేషగిరిరావు చెప్పారు. పెరిగిపోయిన ఖర్చులకు అనుగుణంగా టిక్కెట్ రేట్లు ఉండాలని కోరినట్లుగా తెలిపారు. కొత్తగా విడుదలయ్యే సినిమాల బెనిఫిట్ షో కోసం అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం తప్పకుండా అనుమతి ఇస్తుందని ఆయన చెప్పారు.
అయితే ప్రెస్మీట్లో మాత్రం పేర్ని నాని బెనిఫిట్ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదని స్పష్టం చేశారు. టాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేకపోవడంతో టిక్కెటింగ్ పోర్టల్‌కు అంగీకరించినట్లయింది. ఇక రిలీజ్ కాబోయే పెద్ద సినిమాలన్నీ ప్రభుత్వం ద్వారానే టిక్కెట్ల అమ్మకాలు జరపడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వమే టిక్కెట్లు అమ్మే పనయితే.. రేట్లు పెంచే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.