టాలీవుడ్లో పీఆర్వోల సంస్క్రృతి గురించి కొత్తగా చెప్పేదేముంది? ప్రతీ సినిమాకీ, ప్రతీ హీరోకీ.. ఓ పీఆర్ ఓ తప్పనిసరి. కొన్ని సంస్థలకు శాశ్వత పీఆర్వోలు ఉన్నారు. సినిమా ప్రమోషన్‌కి సంబంధించిన సమస్త వ్యవహారాలూ పీఆర్వోల చేతుల మీదుగానే నడుస్తున్నాయి. అలాంటి కీలకమైన ఈ విభాగం.. ఇప్పుడు ఏకం కానుంది. టాలీవుడ్ పీఆర్వోలంతా ప్రస్తుతం హైదరాబాద్ ఎఫ్. ఎన్.సీ.సీలో ఓ మీటింగు పెట్టుకున్నారు. దాదాపు 15 మంది పీ ఆర్ ఓలు ఈ మీటింగులు పాల్గొన్నారు. పీఆర్ఓ ల తరపున ఓ యూనియన్ ఏర్పాటు చేయడమే ప్రధాన అజెండా. తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో పీఆర్ ఓ లకు యూనియన్లు ఉన్నాయి.కానీ… టాలీవుడ్లో ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నాలేం జరగలేదు. అందుకే.. ఓ యూనియన్ స్థాపించడానికే ప్రస్తుతం ఈ మీటింగ్ జరుగుతోంది. ఓ సంస్థ పీఆర్వో లను అర్థాంతరంగా తీసేసినా, డబ్బులు ఎగ్గొట్టినా, ఒకరి సినిమాల్ని మరొకరు లాక్కున్నా…. ఈ అసోసియేషన్ రంగంలోకి దిగుతుందని, పీఆర్ ఓ ల తరపున నిలబడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మీడియాకీ – పీఆర్వోలకు చిన్న పాటి గ్యాప్ మొదలైంది. దాన్ని సర్దుబాటు చేయడం ఎలా? అనేదానిపైనా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం.