మొన్ననే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నట్టు…
నిన్ననే సంక్రాంతి పండగ జరుపుకున్నట్టు..
అనిపిస్తోంది గానీ, అప్పుడే 2020లో ఓ నెల గడిచిపోయింది. జనవరి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. అయితే తెలుగు చిత్రసీమకు మాత్రం కొన్ని తీపి జ్ఞాపకాల్ని మిగిల్చిపోయింది. 2019లో చాలా ఎత్తూ, పల్లాలు చవి చూసిన టాలీవుడ్‌కి ఓ రకంగా శుభారంభం అందించింది 2020. జనవరిలో వచ్చిన సినిమాలు, అవి సాధించిన రికార్డు వసూళ్లే అందుకు సాక్ష్యం. అలాగని ఫ్లాపులు లేవని కాదు, పుష్కలంగా ఉన్నాయి. అయితే ఓ రెండు సినిమాలు ఇచ్చిన కిక్ ముందు ఆ పరాజయాలు పెద్దగా కనిపించలేదు.
2020 జనవరి 1న బాక్సాఫీసు దగ్గర తెలుగు సినిమాల హడావుడి కనిపించింది. జనవరి 1 బుధవారం వచ్చినా, కొత్త సినిమాల తాకిడి తగ్గలేదు. తూటా, అతడే శ్రీమన్నారాయణ అనే రెండు డబ్బింగ్ సినిమాలతో పాటు బ్యూటీఫుల్, ఉల్లాలా ఉల్లాలా అనే తెలుగు సినిమాలు వచ్చాయి. నాలుగూ ఫ్లాపులే. జనవరి 3న హల్ చల్, వైఫ్ ఐ, నమస్తే నేస్తమా చిత్రాలు విడుదల అయ్యాయి. అవీ ఫ్లాపులే. అలా జనవరి మొదటి వారం డిజాస్టర్లు క్యూ కట్టయి.
జనవరి 9న దర్బార్ విడుదలైంది. రజనీకాంత్ – మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. యావరేజ్ టాక్ తెచ్చుకుని, ఓ మోస్తరు వసూళ్లు సంపాదించింది. 11న సరిలేరు నీకెవ్వరు విడుదలైంది. మహేష్ బాబు మ్యాజిక్ మరోసారి బాక్సాఫీసు దగ్గర వర్కవుట్ అయ్యింది. మహేష్ కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 200 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చినట్టు, ఆల్ టైమ్ ఇండ్రస్ట్రీ రికార్డు మాదే అన్నట్టు చిత్రబృందం చెబుతోంది. అయితే ఈ వసూళ్ల లెక్కలపై కొంత గందరగోళం ఉంది. ఏదైతేనేం.. మహేష్‌కు మరో సూపర్ హిట్ పడిపోయింది.
జనవరి 12న… అల.. వైకుంఠపురములో విడుదలైంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 3వ సినిమా ఇది. అంచనాలకు మించిన భారీ విజయాన్ని నమోదు చేసింది. కుటుంబం అంతా కలిసి చూసే లక్షణాలు ఉండడం, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, బన్నీ – త్రివిక్రమ్‌లకు ఉన్న ఫ్యాన్ బేస్, సంక్రాంతి సీజన్… ఇవన్నీ ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి. దాదాపు 220 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చినట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇండ్రస్ట్రీ రికార్డు మాదే అని సరగ్వంగా ప్రకటించుకుంది. సరిలేరు నీకెవ్వరు ఇచ్చిన పోటీని తట్టుకుని నిలబడింది. వసూళ్ల విషయంలో కాస్త కాంట్రవర్సీ ఉన్నా – బన్నీ కెరీర్లో ఇదే అతి పెద్ద హిట్టు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకుందామని వచ్చిన మరో సినిమా `ఎంత మంచివాడవురా` ఏమాత్రం మెప్పించలేదు. రొటీన్ కథ, కథనాలు, సీరియల్ టేకింగులతో సతీష్ వేగేశ్న బాగా బోర్ కొట్టించేశాడు. ఈ సంక్రాంతి సినిమాల్లో ఎలాంటి ప్రభావం చూపించని సినిమా ఇదే.
సంక్రాంతి సీజన్ అయిపోయాక.. డిస్కోరాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి రవితేజకు నిరాశనే మిగిల్చింది. భారీ గా ఖర్చు పెట్టి తీసినప్పటికీ, సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకుల మెప్పుని పొందలేకపోయాడు. అటు నిర్మాతలకూ, ఇటు బయ్యర్లకూ ఈ సినిమా తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ నెలాఖరున వచ్చిన అశ్వద్ధామ కూడా అంతంత మాత్రంగానే ఆడుతోంది. నెగిటీవ్ రివ్యూలు ఈ సినిమా కొంప ముంచాయి. దాదాపు 12 కోట్లతో తెరకెక్కించిన సినిమా ఇది. ఆ మొత్తం రాబట్టు కోవడం కష్టమే. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అయిన `చూసీ చూడంగానే` కూడా నిరాశ పరిచింది.
మొత్తానికి ఈ నెలలో రెండే రెండు మంచి విజయాల్ని చూడగలిగింది చిత్రసీమ. నెలంతా ఈ రెండు సినిమాల చుట్టే తిరిగింది. ప్రేక్షకులకూ ఈ రెండు విజయాలతో సంతృప్తి పడిపోయారు. కాకపోతే.. ఇలాంటి సినిమాలు ఈ యేడాది మరిన్ని రావాలి. ముఖ్యంగా చిన్న సినిమాలు నిలదొక్కుకోవాలి. విజయాలు సాధించాలి. అప్పుడే పరిశ్రమ పురోగతి చెందుతుంది.