సినిమా లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇది వరకు స్టార్ హీరో సినిమా అంటే, మిగిలిన కాస్టింగ్ ఎలా ఉన్నా ఫర్వాలేదు అనుకునే వారు. హీరోని చూసే జనాలు థియేటర్లకు వస్తారు కాబట్టి, వర్కవుటు అయిపోతుందని భావించే వారు. ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరో ఉన్నంత మాత్రన సరిపోదు. మిగిలిన హంగులూ భారీగా ఉండాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్లు, విలన్లు.
రెగ్యులర్ విలన్ పాత్రలు చూసీ చూసీ జనాలకు మొహం మొత్తేసినప్పుడు, హీరోల్ని విలన్లుగా మార్చే సంప్రదాయం మొదలైంది. అది కొంతకాలం బాగానే వర్కవుట్ అయ్యింది. జగపతిబాబు, శ్రీకాంత్, ఆది పినిశెట్టి లాంటి హీరోలు కాల క్రమంలో విలన్లుగా మారిపోయారు. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి కొంతమంది విలన్లని దిగుమతి చేసుకున్నాం. అర్జున్, ఉపేంద్ర, ఎస్జె సూర్య లాంటి పక్క రాష్ట్రం నటులు విలన్లుగా అవతరించారు. ఇప్పుడు వాళ్లూ బోర్ కొట్టేశారు. ఇప్పటి సినిమాకు కొత్త విలన్లు కావాలి. ఎవరూ చూడని విలనిజం చూపించాలని దర్శకులు తాపత్రయ పడుతున్నారు. అయితే విలన్లు మాత్రం దొరకడం లేదు.
ఇటీవల ఓ స్టార్ హీరో సినిమా కోసం దేశమంతా అన్వేషించినా విలన్ దొరకలేదు. విలన్ లేక.. ఆ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇదే పరిస్థితి చాలా సినిమాలకు కనిపిస్తోంది. మహేష్, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్.. వీళ్లకు విలన్లను వెదికి పెట్టడం అతి పెద్ద సమస్యగా మారింది. హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే, అంతకంటే శక్తిమంతమైన విలన్ అవసరం. అందుకే ఈమధ్య విలన్లకు గిరాకీ పెరిగింది. అయితే అందరీనీ ఓ రౌండ్ కొట్టేయడం వల్ల, కొత్త విలన్లు దొరక్కపోవడం వల్ల… ప్రతినాయకుడి పాత్రలకు కొరత వచ్చిపడిపోయింది. ఇప్పుడున్న హీరోలు కొంతమంది విలన్లుగా మారడానికి ముందుకొస్తే తప్ప, ఈ సమస్యకి పరిష్కారం దొరకదు.