సీనియర్ సినీ నటుడు జేవీ రమణమూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం ప్రాణాలు విడిచారు. శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరు తెచ్చుకొన్న జెవి సోమయాజులు సోదరుడే ఈయన స్వస్థలం విజయనగరం. ‘ఎమ్మెల్యే’ సినిమాతో తెరంగేట్రం చేసిన జేవీ రమణమూర్తి దాదాపు 150 సినిమాల్లో నటించారు. మాంగల్య బలం, బాటసారి, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, ఆకలి రాజ్యం, సప్తపది, ఆంధ్ర కేసరి, ఆనంద భైరవి, కర్తవ్యం, ఆర్య ఆయనకు పేరు తెచ్చాయి. నటుడిగా ఆయన చివరి చిత్రం శంకరదాదా జిందాబాద్ .
అంతకు ముందు నాటకరంగంలోనూ రమణమూర్తి రాణించారు. ఎన్జీవో, ఎవరు దొంగ, కప్పలు, నాటకం, కీర్తి శేషులు, కాలరాత్రి, ఫణి నాటకాల్లో నటించారు. గురజాడ ‘కన్యాశుల్కం’ అంటే రమణ మూర్తికి ఎంతో ఇష్టం. ఆ నాటకాన్ని తన దర్శకత్వంలో సుమారు వెయ్యిసార్లు ప్రదర్శించారు. రమణ మూర్తి మరణం పట్ల తెలుగు చిత్రసీమ ప్రగాఢ సంతాకం తెలియజేసింది. రేపు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.