సినీ క్యాలెండర్ లో మరో నెల ముగిసినట్లే. సెప్టెంబర్ లో భారీ, చిన్న, మీడియం సినిమాలు సందడి చేశాయి.
’35 చిన్న కథ కాదు’ అనే చిన్న సినిమాతో నెలలో తొలి శుక్రవారం మొదలైయింది. రానా సమర్పకుడిగా వచ్చిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ అనే పేరు తెచ్చుకుంది. కమర్షియల్ కొలతలతో చేసిన సినిమా కాదిది. అయితే టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి అవార్డులూ రావొచ్చు.
సెప్టెంబర్ 5న విజయ్ గోట్ సినిమా వచ్చింది. మైత్రీమూవీ మేకర్స్ సినిమాని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళే ముందు చేసిన చివరి సినిమాగా ప్రచారం చేశారు. కానీ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. డైరెక్టర్ వెంకట్ ప్రభు తన బ్యాడ్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. విజయ్ డబుల్ యాక్షన్ వర్క్ అవుట్ కాలేదు. టోటల్ గా సినిమా తెలుగులో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.
సెప్టెంబర్ రెండో వారంలో టివోనో థామస్ ఏఆర్ఎం అనే డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. కృతిశెట్టి హీరోయిన్. ఈ సినిమా కూడా మైత్రీమూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. భారీగా తీసిన సినిమా ఇది. సినిమా కూడా పర్వాలేదు. కానీ తెలుగు ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించలేకపోయింది. టివోనో థామస్ మంచి నటుడు. ఆయన సినిమాలు ఓటీటీలో చూసి జనం ఆదరించారు. కానీ ఈ ఆదరణ తెలుగులో టికెట్ కోనే రేంజ్ వరకూ ఇంకా రాలేదని ఈ సినిమా రిజల్ట్ రుజువు చేసింది.
ఇదే వారంలో వచ్చిన మత్తువదలరా 2 వచ్చింది. వసూళ్లలో ఆకట్టుకొంది. సత్య కామెడీ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఓవరాల్ గా నిర్మాతలు లాభాలు చూశారు. ఒక చిన్న సినిమా హిట్ అయితే ఎలాంటి మ్యాజిక్ వుంటుంది మత్తువదలరా 2 మరోసారి నిరూపించింది.
రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మారుతి సమర్పణలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ని చూసింది. అడల్ట్ కామెడీ వర్క్ అవుట్ కాలేదు. కాన్సెప్ట్ బావున్నా వీక్ డైరెక్షన్ తో సినిమా తేలిపోయింది. ఇదే వారంలో వచ్చిన ఉత్సవం సినిమా కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు.
సెప్టెంబర్ మూడో వారం దేవర తుపానుకు కి ముందే వచ్చే సైలెన్స్ గా మారింది. సుహాస్ గొర్రె పురాణం అనే సినిమా ఇదే వారంలో వచ్చింది. ఐతే ఆ సినిమాకి పెద్దగా ప్రచారం లేదు. సుహాస్ కూడా వోన్ చేసుకోలేదు. ఆ సినిమా వచ్చిన సినిమా సంగతి కూడా పెద్దగా తెలీయలేదు.
సెప్టెంబరు బాక్సాఫీసు జాతకాన్ని డిసైడ్ చేసిన సినిమా… దేవర. విపరీతమైన క్రేజ్, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాస్ సినిమా రేంజ్ ఏమిటో మరోసారి నిరూపించింది. ప్రీమియర్ షోల నుంచే కొత్త రికార్డులు సృష్టించింది. తొలి మూడు రోజుల్లో బాక్సాఫీసు దుమ్ము దులిపేసింది. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వచ్చేసింది. ఎన్టీఆర్ కెరీర్లో మరో మంచి కమర్షియల్ హిట్ ఇది. ఈ యేడాది బాక్సాఫీసు చూసిన భారీ విజయాల్లో ఇదొకటి.
దేవరతో పాటు వచ్చిన కార్తి సత్యం సుందరం చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. మంచి సినిమా అనే కితాబు అందుకుంది. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే ఈ సినిమా మంచి ఫలితాన్ని చూసే అవకాశం వుంది. మొత్తానికి దేవర పుణ్యమా అని.. సెప్టెంబరు నెల గట్టెక్కేసింది. అక్టోబరు లోనూ కొన్ని క్రేజీ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి వాటి జాతకం ఎలా ఉందో చూడాలి.