టాలీవుడ్ లో మరోసారి `సమ్మె` సైరన్ మోగింది. ఈసారి… ఏకంగా నిర్మాతలే… షూటింగుల బంద్కు పిలుపు నిచ్చారు. మొన్నటి వరకూ మా జీతాలు పెంచాలి అని సినీ కార్మికులు బంద్ పేరుతో బెదిరించారు. ఇప్పుడు నిర్మాతలే షూటింగులు వద్దనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈరోజు నిర్మాతలంతా కలిసి ఓ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో సమస్యల గురించీ, నిర్మాతలుగా తాము పడుతున్న కష్టనష్టాల గురించీ మాట్లాడుకొన్నారు. మూతబడుతున్న థియేటర్లు, పెరిగిపోతున్న హీరోల పారితోషికాలు, ఓటీటీ బెడద… ఇలా చాలా అంశాలపై చర్చ జరిగింది. ఇవన్నీ ఓ కొలిక్కి రావాలంటే.. సినిమా షూటింగుల్ని కొంతకాలం ఆపేసి, నిర్మాతలుగా తమ డిమాండ్లేంటో గట్టిగా వినిపించాలని.. తీర్మాణించుకొన్నారు. సోమవారం నుంచి షూటింగులు ఉండకపోవొచ్చు. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఈ విషయంలో నిర్మాతలంతా ఏక తాటిపై ఉండి… సమ్మె సైరన్ మెగించారు. నిర్మాతలే.. షూటింగులు వద్దంటే… అది మామూలు విషయం కాదు. ఈ రంగంపై ఆధారపడుతున్న వేలాదిమంది ఇబ్బందుల్లో పడతారు. ఇప్పటి వరకూ నటీనటులు, కార్మికులు, టెక్నీషియన్లు షూటింగులు బహిష్కరించారు. ఇప్పుడు ఏకంగా నిర్మాతలే.. ఆ నిర్ణయం తీసుకొన్నారు. ఈ అడుగు భవిష్యత్తు రోజుల్లో టాలీవుడ్ ని ఎటువైపుకు తీసుకెళ్తుందో చూడాలి.