డ్రగ్స్ విషయంలో చిత్రసీమ కూడా బాగానే స్పందించింది. ఈ విషయం బయటకు రాగానే.. ప్రెస్ మీట్ పెట్టి తమలోనే వ్యసన పరులున్నారన్న విషయాన్ని మీడియాకు చెప్పేసింది. డ్రగ్స్ కేసులో ఎవరు దొరికినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూనే, ఇలాంటి దురలవాట్ల నుంచి బయట పడాలని హితవు పలికింది. డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడానికి తనవంతు కృషి మొదలెట్టింది. అందులో భాగంగా.. ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని భావిస్తోంది `మా`. ఓ ప్రముఖ రచయిత – దర్శకుడికి ఈ ప్రాజెక్ట్ అప్పగించార్ట. నెల రోజుల్లో షార్ట్ ఫిల్మ్ సిద్ధం చేయాలని సూచించారని తెలుస్తోంది. అందుకు ఆ దర్శకుడు కూడా సరే అన్నాడని సమాచారం. మరి ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఎవరు నటిస్తారో, ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.
* సినిమా కూడా…?
ఏ విషయాన్నయినా, వివాదాన్నయినా సినిమా టిక్‌గా మలచుకోవడంలో సినీ పరిశ్రమ దిట్టే. డ్రగ్స్ ఉదంతం కూడా సినిమాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ – సినిమా… ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని ఓ సినిమా రూపొందించే పనిలో ఓ ప్రముఖ దర్శకుడు బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ కేసులో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయో, వాళ్లని పోలిన పాత్రలు సినిమాలో కనిపిస్తాయట. వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని చిత్రాల్ని రూపొందించే ఓ దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో ఉన్నాడని తెలుస్తోంది. డ్రగ్స్ కేసు వార్తల్లో ఉన్నప్పుడే ఈ సినిమాని మొదలెట్టి.. విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి ఆ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.