నొప్పించక, తానొవ్వక … సమయానుకూలంగా స్పందించువాడే ధన్యుడు. అంతే కానీ లేనిపోని ఈగోలే పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. ముఖ్యమంగా సినీ పరిశ్రమలకు ఈ విషయం బాగా తెలుసు. అయినా ఎందుకో కానీ.. ఈగోలకు పోయి సమస్యలు తెచ్చుకుంటోంది.
రేవంత్ ప్రభుత్వం అంటే ఎందుకంత నిర్లక్ష్యం !
తెలంగాణలో ప్రభుత్వం మారి ఏడాది అయింది. ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమానికీ టాలీవుడ్ నుంచి మద్దతు రాలేదు. చివరికి గద్దర్ అవార్డులు ఇస్తామన్నా పట్టించుకోలేదు. అంటే రేవంత్ ప్రభుత్వ ఉనికి టాలీవుడ్ గుర్తించడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలతో వ్యాపార వ్యవహారాలు పెట్టుకుని వారి ఎజెండాకు తగ్గట్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
గ్లాస్ లాంటి ఇండస్ట్రీ రాళ్లు పడకుండా చూసుకోవాలి !
టాలీవుడ్ గ్లాస్ లాంటి ఇండస్ట్రీ.తమపై రాళ్లు పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు తమపై రాళ్లు వేయాలనుకుంటే అందుబాటులో కుప్పలు కుప్పలు ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ అలాంటిది. అన్నీ చట్ట ప్రకారం చేయలేరు. పద్దతిగా ఏదీ నడపలేరు. అందుకే ఏ ప్రభుత్వం ఉన్నా వారితో పరిచయాలు పెంచుకోవాలి. వారితో లొల్లి పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు. కానీ.. పెట్టుకునే పరిస్థితి వస్తే మాత్రం పదిలి పెట్టరని అనుకోవచ్చు.
ఆడియో,సక్సెస్ మీట్లలో ఇచ్చే ప్రసంగాల రేంజ్ సరిపోతుంది!
టాలీవుడ్లో మొహర్బానీ అనేది కామన్. పొగడటానికి హద్దూపొద్దూ ఉండదు. అల్లు అర్జున్ రిలీజైనా తర్వాత గీత ఆర్ట్స్ ఆఫీసు ఎదుట చిన్నికృష్ణ అనే రచయిత చేసిన ఓవరాక్షన్ స్పీచ్ ను చూస్తే.. ప్రభుత్వంలో ఉన్న వారు తమ పవర్ ను మరింత చూపించాలని అనుకుంటారు. అలాంటి వాటి వరకూ తెచ్చుకోకుండా.. సినీ ఇండస్ట్రీ సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. ప్రభుత్వాన్ని కాసిన్ని పొగడ్తలతో ముంచెత్తి… వారు కోరుకున్న ప్రచార సహకారాన్ని అందించి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే.. పరిస్థితులు ఇక్కడి వరకూ రావు.