రాముడు ఆదర్శ పురుషుడు. మనిషంటే ఎలా ఉండాలో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంలా నిలిచినవాడు. రాముడిలా బతకడం ఎంత కష్టమో, వెండి తెరపై రాముడిలా కనిపించడమూ అంతకంటే కష్టం. ఎందుకంటే అది ఆషామాషీ పాత్ర కాదు. కళ్లల్లో వాత్సల్యం ఉండాలి. మాటల్లో మృధుత్వం తొణికిసలాడాలి. నడక, నడతలో రాజసం కనిపించాలి. అన్ని భావావేశాలనూ అదుపులో పెట్టుకోగలగాలి. మరీ ముఖ్యంగా ఆ ముఖ వర్చస్సులో దైవత్వం కనిపించాలి. అందుకే రాముడి పాత్ర అంత సంక్లిష్టమైనది. రాముడిగా కనిపించాలంటే… మహా నటులు సైతం ‘మనకెందుకులే.. ఆ భారం’ అనుకొనేవారు. ఆ పాత్ర అంత పవర్ఫుల్. అయితే తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచీ, ఇప్పటి వరకూ కొంతమంది నటులు ఆ సాహసం చేశారు. అందులో మెప్పించి, గుర్తిండిపోయేవాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
రాముడి కథతో వచ్చిన తొలి సినిమాల్లో గుర్తుండిపోయేది… ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. యాడవల్లి సూర్య నారాయణ రాముడి పాత్రలో దర్శనమిచ్చారు. అలా తొలిరాముడిగా ఆయన పేరు గుర్తుండిపోతుంది. ఆ తరవాత రామ పాత్ర ఎవరు చేయాలన్నా.. ఈయన్ని రిఫరెన్సుగా తీసుకొనేవారు. కానీ వెండి తెరపై ఎంత మంది రాముళ్లు కనిపించినా, ఆ పాత్రకు పేటెంట్ తీసుకొన్నది మాత్రం ఎన్టీఆరే! తొలిసారి ‘సంబూర్ణ రామాయణం’ అనే తమిళ చిత్రంలో ఎన్టీఆర్ రాముడిగా కనిపించారు. అప్పటి నుంచి ఆయన వెండి తెర వేల్పు అయిపోయారు. రాముడి పాత్ర పోషించాలంటే ఎన్టీఆరే… అనే స్థాయిలో ఘనత సాధించారు. లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం తదితర చిత్రాల్లో రాముడిగా దర్శనమిచ్చి అభిమానుల గుండెల్లో కొలువైపోయారు.
ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ చిత్రంలో హరనాథ్ రాముడిగా మెప్పించారు. ‘వీరాంజనేయ’ చిత్రం ఓ కాంతారావు కూడా రాముడి అవతారం ఎత్తినవారే. ఏఎన్నార్ కూడా రాముడిగా కనిపించారు. ‘సీతారామజననం’లో అక్కినేనిని రాముడిగా చూడొచ్చు. అయితే ఎన్టీఆర్ రాముడిగా కనిపించిన తరవాత మళ్లీ.. ఆ పాత్ర వైపుకు పోలేదు అక్కినేని. ఎన్టీఆర్ తరవాత ఆ స్థాయిలో రామ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది శోభన్‌బాబు. ఆయన స్వతహాగా అందగాడు. రాముడి పాత్రలో మరింత మెరిసిపోయారు. ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్‌బాబు రాముడిగా దర్శనమిచ్చి అభిమానుల నుంచి హారతులు అందుకొన్నారు. ‘సీతా కల్యాణం’లోనూ శోభన్‌బాబుని రాముడిగా చూడొచ్చు. ‘శ్రీరామరాజ్యం’లో నందమూరి బాలకృష్ణ రాముడిగా నటించి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు. ఈతరం హీరోల్లో ఆ సాహసం చేసింది ప్రభాస్ ఒక్కడే. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ‘బాల రామాయణం’లో రాముడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత.. అలాంటి ప్రయత్నం చేయలేదు. ‘శ్రీరామదాసు’లో సుమన్ రాముడిగా కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మధ్యమధ్యలో కొంత మంది ఈ సాహసం చేసినా, ప్రేక్షకుల మనసుల్ని మెప్పించలేకపోయారు. ఈ నటుల జీవితాల్లో రామ పాత్ర ఓ అపురూప జ్ఞాపకంగా మిగిలిపోయింది.
(ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా)