ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా.. ముందుండి విరాళాలు ప్రకటించేది.. సినిమా వాళ్లే. తుఫాన్లు, వరదలూ వచ్చినప్పుడు ఆదుకోవడానికి ముందడుగు వేసేదీ వాళ్లే. కరోనా ఫస్ట్ వేవ్.. కుదిపేస్తున్నప్పుడు టాలీవుడ్ స్టార్లు జోరుగా విరాళాలు ఇచ్చారు. రెండు తెలుగు ప్రభుత్వాలతో పాటు, కేంద్రానికీ… తమ వంతు సాయం అందించారు. ఇప్పుడు మరోసారి… వాళ్ల ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఏర్పడింది.కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి మరింత ఉధృతంగా మారుతోంది. పరిస్థితులు చేదాటి పోతున్నాయి. ఆక్సిజన్ అందక, ఆసుపత్రిలో పడకలు లేక.. చాలామంది అవస్థలు పడుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందిస్తే నిలబడే ప్రాణాలు కాస్తా.. గాలిలో దీపాలుగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో… చిత్రసీమ ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది.
తమిళనాట.. విజయ్ ముందుకొచ్చి.. ఆక్సిజన్ సిలండర్లకు ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసేలా ఏర్పాటు చేశాడు. ఇంకొంతమంది హీరోలూ అదే దారిన నడుస్తున్నారు. టాలీవుడ్లోనూ హీరోలు ఇలానే చొరవ చూపిస్తే బాగుంటుంది. నిజానికి ఇప్పుడే వాళ్ల అవసరం ఎక్కువ. ఎందుకంటే.. ఆక్సిజన్ సిలండర్ల లోటు చాలా చోట్ల కనిపిస్తోంది. చాలా ప్రభుత్వ ఆసుపత్రులలో అరకొర సౌకర్యాలే ఉన్నాయి. తమ వంతు సాయంగా… ఆక్సిజన్ సిలండర్లు అందించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతీసారీ సినిమావాళ్లే స్పందించాలా? అనేం లేదిప్పుడు. ఎవరు ఎలాంటి సాయం చేసినా… అది చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది. సినిమా వాళ్లు చేసిన సహాయం ఎప్పుడూ ధన రూపంలోనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఆక్సిజన్ సిలెండర్లపై దృష్టి సారిస్తే మంచిది. లేదంటే.. హీరోలు ఇచ్చిన విరాళాల్ని ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం కేటాయిస్తే ఇంకా బాగుంటుంది.
గతంలో సీసీసీకి కూడా హీరోలు భారీ విరాళాలు ఇచ్చారు. దాంతో… సినీకార్మికులకు కాస్త సహాయం అందింది. అప్పుడు ఇచ్చిన నిధులు కొన్ని మిగిలి ఉండడంతో.. అడపా దడపా వాటినే ఉపయోగిస్తూ సాయం చేస్తున్నారు. సినీ కార్మికులకు అవసరమైన వాక్సిన్లని ఇప్పటికే సీసీసీ అందిస్తోంది. ఆక్సిజన్ సిలండర్లూ, భీమా లాంటి సదుపాయాలు అందించడానికి సీసీసీ మరోసారి ముందుకు వస్తే బాగుంటుంది.