చిత్రపరిశ్రమని ఆంధ్రప్రదేశ్ కి తరలించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా మారుతోంది. ఇటీవల సినీ ప్రముఖులతో జగన్ వేసిన భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. `మీరంతా ఇక్కడికి వచ్చేయండి.. స్థలాలు ఇస్తా.. ఇళ్లు కట్టుకోండి. స్టూడియోలు కట్టుకోండి` అంటూ జగన్ ఆఫర్లు ఇచ్చారు. ఆ దిశగా కూడా.. ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. విశాఖలో స్టూడియోలకు అనుగుణంగా ఉండే స్థలాల అన్వేషణ, సేకరణ పనులు ఓ వైపు మొదలైపోయినట్టు తెలుస్తోంది. విశాఖతో పాటుగా రాజమండ్రి, గుంటూరు తదితర ప్రదేశాల్లో కూడా స్డూడియోలను నిర్మించాలన్నది ఆలోచన. విశాఖలో సమాంతర ఇండస్ట్రీ స్థాపించాలని, ఏపీలో చిత్రీకరణలకు అనుగుణమైన వాతావరణం ఉంది.. అనే భరోసా చిత్రసీమకు వచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నది జగన్ ప్రభుత్వ ప్రణాళిక.
ఇప్పటికైతే కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలోనే చేయాలన్న నిబంధన విధించారు. త్వరలో దాన్ని 50 శాతానికి మార్చబోతున్నారని సమాచారం. ఈలోగా.. స్టూడియోలు, ఇళ్ల స్థలాలకు అనువైన స్థలాల్ని వెదికి పట్టే పనిలో ఉంది. ఇప్పటికే వైజాగ్ లో.. సినిమా వాళ్లకు సంబంధించిన కొన్ని యూనియన్లు ఉన్నాయి. వాళ్లందరికీ స్థలాలు ఇస్తే.. అక్కడే సెటిల్ అయిపోవొచ్చు. చిరంజీవి, నాగార్జునలు… ఏపీలో స్టూడియో నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది వరకే… కొంతమంది టాలీవుడ్ స్టార్లు స్టూడియోల కోసం స్థలాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలి. అంత స్థలం.. విశాఖలో లేకపోవొచ్చు. అందుకే ఏపీలో మిగిలిన చోట్ల కూడా.. స్టూడియో నిర్మాణాలకు అనువైన వాతావరణం ఉందా,ఉంటే ఎక్కడ వుంది? అనే విషయాలపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తుంది.