సినీ పరిశ్రమలోని వ్యక్తులు ప్రతి ఒక్కరికి సాఫ్ట్ టార్గెట్. వారు తప్పు చేస్తే ఖచ్చితంగా రోడ్డున పడేయాల్సిందే. కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం వారి ప్రైవసీని గౌరవించాలి. అది సామాన్య ప్రజలైనా. రాజకీయ నేతలైనా. సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో పుకార్లుగా మొదలైన కొన్ని నేరేటివ్స్ నాగార్జున కుటుంబ నైతికతను ప్రశ్నించేలా ప్రజల్లోకి వెళ్లిపోయాయి. కొండా సురేఖ వ్యాఖ్యలతో మరింతగా చర్చకు వచ్చాయి. ఇప్పుడు కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ కాస్త ధైర్యంగా స్పందించడంతో గౌరవం నిలబెట్టుకునే ప్రయత్నం జరిగాయి.
సమంత, నాగచైతన్య, రకుల్ ప్రీత్, నాగార్జున అందరూ ఇండస్ట్రీలోని వ్యక్తులు. వారిపై ఇంత ఘోరమైన నిందలేస్తే మిగిలిన వారు నవ్వుకుంటే ఇండస్ట్రీలో ఐక్యత లేనట్లే. నాగార్జున స్వార్థపరుడని.. ఆయన టిక్కెట్ల విషయంలో జగన్ ఇండస్ట్రీని టార్చర్ పెడుతూంటే ముసిముసిగా నవ్వుకున్నారని ఆయన బాగా జరిగిందని అనుకోవడం దీర్ఘకాలంలో చేటు చేస్తుంది. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ సమస్యల టాపిక్ కాదు ఇందులో పని చేసే అమ్మాయిల వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం . దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం టాలీవుడ్ కుఉంది. అందుకే అందరూ స్పందించారు. ముందుగా సోషల్ మీడియాలో కొండా సురేఖ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వచ్చిన కామెంట్లతో రాత్రికి స్టార్లు ధైర్యం తెచ్చుకున్నారు. సమంతకు ఆత్మీయులుగా పేరు ఎన్టీఆర్, నాని సహా అందరూ స్పందించారు.
ఈ వివాదం ఇంతలో సద్దుమణుగుతుందేమో కానీ.. కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలకు ఒక్క శాతం ఆధారం లేకున్నా ప్రజల్లో నమ్మేవాళ్లు ఉంటారు. గాసిప్స్ గా చెప్పుకుని సంతృప్తి పడేవాళ్లు ఉంటారు. లోకులు ఏం చెప్పుకుంటే మాకెందుకులే అని సినీ తారలు బిందాస్ గా తీసుకోవడానికి ఉండదు. వారికి పబ్లిక్ ఇమేజే చాలా ముఖ్యం. రాజకీయ నేతలు ఇలా తమపై దాడిచేసినప్పుడల్లా… ఒక్కటిగా ఇండస్ట్రీ తమను తాము కాపాడుకోవడం నేర్చుకుంటే.. కొంతైనా గౌరవాన్ని నిలబెట్టుకునేవారవుతు. లేకపోతే ప్రతి చిన్న వ్యక్తి నుంచి ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.