ఏపీ ఎన్నికల్లో చిత్రసీమ మొత్తం టీడీపీ కూటమి వైపే ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జగన్ హయంలో చిత్రసీమకు ఒరిగిందేం లేదు. పైగా అడుగడుగునా అవమానాలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమతో మంచి అనుబంధం ఉండేది. అది.. జగన్ సర్కారు వచ్చాక పూర్తిగా పోయింది. చాలామంది దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. టీడీపీ కోసం పని చేశారు. ఇప్పటికీ వాళ్లంతా టీడీపీ వెనుకే ఉన్నారు. వచ్చే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ప్రతీ చిన్న అంశం.. ఈ ఎన్నికల్లో కీలకమే. ముఖ్యంగా ప్రచారం ముమ్మరంగా సాగాలి. అందుకోసం పాటలు, స్కిట్లూ రెడీ చేయాలి. ఇప్పటికే కొంతమంది దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి.. టీడీపీ, జనసేన కూటమి కోసం పని చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్కిట్లు, పాటలూ రెడీ అయిపోయాయని తెలుస్తోంది. ఓ సీనియర్ దర్శకుడి నేతృత్వంలో ఓ టీమ్ ఇందుకోసం రాత్రింబవళ్లూ కష్టపడుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపులో.. డిజిటల్ ప్రచారం కీలక పాత్ర పోషించింది. అందుకే ఏపీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలు వీటిపై దృష్టి సారించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లని నమ్ముకొంది. వీడియోకి ఇంత అంటూ కొంత ఇచ్చి, పెయిడ్ పబ్లిసిటీ చేయించుకొంటున్నారు. టీడీపీ కూటమికి ఆ అవసరం లేదు. చంద్రబాబుకి సన్నిహితులైన దర్శకులు ఇప్పటికే ఈ కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. జనసేనకు సైతం… చిత్రసీమలో సానుభూతి ఉంది. వాళ్లంతా కేవలం పార్టీపై అభిమానంతో ముందుకు వస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం. టీడీపీ కూటమి డిజిటల్ ప్రమోషన్ల పరంగా తన సత్తా చూపించడానికి సిద్ధంగా ఉంది. వైకాపా తరపున ఎన్నికల్లో ప్రచారం చేయడానికి చిత్రసీమ నుంచి స్టార్ కాంపైనర్లు ఎవరూ లేరు. టీడీపీ, జనసేన కూటమికి ఈ విషయంలో లోటు లేదు. ఈసారి ఎన్నికల్లో ఎవరెవరు ప్రచారం చేస్తారన్న విషయంలో ఇంకా ఓ స్పష్టత లేదు కానీ, ప్రచార పర్వం మొదలయ్యేసరికి టాలీవుడ్… టీడీపీ కూటమి వెనుకే ఉండడం ఖాయంలా కనిపిస్తోంది.