టాలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలకు అపాయింట్మెంట్ ఖరారైంది బ్యాగులు సర్దుకుని రెడీగా ఉండండి అని సమాచారం పంపారు. తర్వాత స్పందన లేదు. దీంతో టిక్కెట్ రేట్లపై చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని ప్రయత్నించిన సినీ పెద్దలకు మరోసారి నిరాశే ఎదురయింది. సినిమాలు విడుదల చేసుకోలేరు. షూటింగ్‌లు చేసుకోలేరు . ప్రతీ దానికి కష్టాలే. ఈ కష్టాలన్నీ ప్రభుత్వం సృష్టించినవే. కానీ గతంలో రెడ్ కార్పెట్ వేసిన ప్రభుత్వాలతో ఈ సినీ పెద్దలు… చిన్నలు వ్యవహరించిన తీరు గుర్తు చేసుకుంటే వీరికి ఈ ట్రీట్మెంట్ మాత్రమే కరెక్టనేది ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. అందుకే ఎవరి వద్ద నుంచీ సానుభూతి దక్కడం లేదు.
పిలిచి నంది అవార్డులిస్తే కుల ముద్ర వేసి రచ్చ చేసిన నాటి ప్రముఖులు..!
2017 చివరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల్ని ప్రకటించింది. సింహా అవార్డులను ప్రకటిస్తామన్న తెలంగాణ ఆ సంగతే మర్చిపోయింది. కానీ సినిమాల విషయంలో బాధ్యతగా ఏపీ ప్రభుత్వం సినీ రంగం నుంచే కమిటీలను నియమించి వారితోనే అవార్డులను ఎంపిక చేయించి ప్రకటించింది. అదే ఏపీ ప్రభుత్వం చేసిన తప్పయిపోయింది కొంత మంది కులం కార్డులు తీసుకుని బయలుదేరారు. అవార్డులు వచ్చిన వారి మీద కులం ముద్ర వేశారు. పోసాని లాంటి వారు కూడా పెద్ద మేధావుల్లా బయటకు వచ్చి తనకు నంది అవార్డు కులం ద్వారా వచ్చిందన్నట్లుగా మాట్లాడారు. ఇక ఇతరుల గురించి చెప్పాల్సిన పని లేదు. బన్నీ వాసు అనే మెగా క్యాంప్ వ్యక్తి ఈ క్యాంపెన్‌ను ప్రధానంగా నడిపించారు. ఆ వివాదం అంతటితో ముగిసిపోయింది. వివాదాల కారణంగా ప్రభుత్వం కూడా ఆ అవార్డులను ప్రధానం చేసే కార్యక్రమం నిలిపివేసింది. ఇక ఏ సినీ కార్యక్రమమూ చేపట్టలేదు.
ఇప్పుడు ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నా కిక్కురుమనని దుస్థితి..!
తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినా ఇండస్ట్రీ ఒకటే . రాజకీయాల గురించి పక్కన పెడితే వ్యాపార పరంగా ఇండస్ట్రీకి అటు ఏపీ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇబ్బందులు రానివ్వలేదు. తెలంగాణ వైపు నుంచి ఇప్పటికీ సమస్యలు లేవు. అన్ని రకాలుగ సహకరిస్తున్నారు. కానీ గత రెండేళ్లుగా ఏపీలోనే కనీసం వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. టిక్కెట్ రేట్లను అడ్డగోలుగా తగ్గించారు. ధియేటర్లకు ప్రోత్సాహకాలు లేవు. షోలు పెంచుకునే వెసులుబాటు లేదు. అంటే ఆర్థిక మూలాలు దెబ్బకొట్టారన్నమాట. తెలంగాణలో మాత్రమే విడుదల చేసుకునే పరిస్థితి లేదు. వకీల్ సాబ్ మూవీ విషయంలో ఆ నిర్మాతలు.. ఎగ్జిబిటర్లు ఎంత మానసిక వేదనకు గురి అయ్యారో అనుభవించారో వారికే తెలుస్తుంది.
ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు..?
సినిమా వాళ్లతోనే వేసిన కమిటీలు నిర్ణయించిన నంది అవార్డులే తమకు రాలేదని కులాలు, మతాల పేరుతో రచ్చ చేసిన సినిమా వాళ్లు ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదు. కళలను ప్రొత్సహించేందుకు అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మీద బురదజల్లిన వారికి .. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆ ప్రభుత్వమే తమ ఆర్థిక మూలాలను దెబ్బకొడుతోంది. ఎందుకూ పనికి రాకుండా చేస్తోంది. కానీ ఒక్కరూ మాట్లాడటం లేదు. అయిన దానికి .. కాని దానికి గత ప్రభుత్వంపై పెట్రేగిపోయిన మెగా బ్రదర్ నాగబాబు .. జగన్‌కు ఏమీ తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయని చెప్పి… ” విక్రమార్కుడు” సినిమాలో భార్య మానాలు పోతే పోయాలయి.. ప్రాణాలైనా కాపాడుకుందామనే పోలీస్ అఫీసర్ క్యారెక్టర్‌ను గుర్తు చేస్తున్నారు. మంచి చేద్దామని చూసినోళ్లపై నిందలు వేసి.. ఇప్పుడు వారు ఏం సాధించారో తెలుసుకుని ఉంటారో లేదో అనవసరం కానీ.. నష్టం మాత్రం వారికే జరిగింది.
ఇప్పుడు అవార్డుల సంగతి దేవుడెరుగు.. హక్కుల గురించి అడగగలరా..?
తమకు అవార్డులు రాలేదని .. వచ్చినా పెద్ద అవార్డులు రాలేదని నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అదే ఇప్పుడు అవార్డుల గురించి అడిగే సాహసమే చేయలేరు. నోరు మెదపడానికి నిక్కర్లు తడిచిపోతాయి. అంతే కాదు అయిన దానికి కాని దానికి సూపర్ స్టార్లుగా.. చెప్పుకునేవారు ట్విట్టర్ లో శభాష్ చెప్పేస్తూంటారు. అలా చెప్పకపోతే ఏ వైపు నుంచి ఏ ప్రభుత్వ వ్యవస్థ వచ్చి దాడి చేస్తుందోనని భయం. కానీ ఏ రాష్ట్రం అవార్డుల కోసం అయితే రచ్చ చేశారో రాళ్లేశారో ఆ రాష్ట్రం నుంచే ఇప్పుడు ఇండస్ట్రీకి ముప్పు ఏర్పడింది. రాజీ చేసుకుని కప్పం చెల్లించి బయటపడతారో.. లేకపోతే పోరాడి సినిమాను కాపాడుకుంటారో వేచి చూడాల్సిందే..!