ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశానికి వచ్చిన టాలీవుడ్ ప్రముఖులకు అమరావతి రైతుల సెగ తగిలింది. విజయవాడ వచ్చిన సినీ ప్రముఖులు నేరుగా కరకట్టపై ఉన్న పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. మొదట్లో వారంతా.. విజయవాడలోని స్టార్‌హోటల్‌కు వెళ్తారని అనుకున్నారు. కాని గోకరాజు గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. వీరు వస్తున్న విషయం తెలిసిన రాజధాని రైతులు.. మహిళలు పెద్ద ఎత్తున కరకట్ట వద్దకు వచ్చారు. చిరంజీవి బృందం బస చేసిన గెస్ట్‌హౌస్ ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
మూడు రాజధానులు వద్దు రాజధానే ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేశ్‌బాబు సహా పలువురు ప్రముఖులు ఈ బృందంలో ున్నారు. అమరావతి అభివృద్ధే భవిష్యత్తుకు ఉషోదయమని వారు నినాదాలు చేశారు. అనూహ్యంగా రైతులు.. మహిళలు రావడంతో… పోలీసులు అప్రమత్తమయ్యారు. సినిమా ప్రముఖులు అమరావతినే రాజధానిగా కొనసాగించమని జగన్‌కి ఒక్క మాట చెప్పాలని అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ నేత సుంకల పద్మశ్రీ డిమాండ్ చేశారు. మీరు రీల్ లైఫ్ హీరోస్ మాత్రమే కాదు.. రియల్ లైఫ్ హీరోస్ అని రుజువు చేసుకోవాలని సవాల్ చేశారు.
అమరావతి రాజధాని ఒక్క రైతులదే కాదు.. మన అందరిదని రాజధాని మీ బాధ్యత కాదా అని పద్మశ్రీ ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతన్నను సినీ పెద్దలు ఆదుకోవాలన్నారు. రైతుల దగ్గర సినీ ప్రముఖులు వినతి పత్రం తీసుకుంటారని.. వారితో కొంత సేపు మాట్లాడతారని అనుకున్నారు కానీ.. అలాంటి చాన్స్ రాలేదు.