2020 చిత్రసీమకు ఏమాత్రం కలసి రాలేదు. ఆమాటకొస్తే… యావత్ ప్రపంచమే స్థంభించిపోయింది. 2021లో అయినా మంచి జరుగుతుందనుకుంటే – ఈ యేడాది కూడా సేమ్ `సినిమా` చూపిస్తోంది కరోనా. మూడు నెలల నుంచి షూటింగులు లేవు. కొత్త సినిమాలు లేవు. ఆగస్టు నుంచే మళ్లీ చిత్రసీమ యధాస్థానానికి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల మాట. అయితే… అంతకంటే ముందే షూటింగులకు క్లాప్ కొట్టే అవకాశాలున్నాయని సమాచారం. మహా అయితే… ఈ నెలంతా లాక్ డౌన్ ఉండొచ్చు. జులై నుంచి ఇది వరకటి వాతావరణం కనిపించే అవకాశాలున్నాయి. షూటింగులకు కూడా జులై నుంచే అనుమతులు లభించొచ్చని సమాచారం అందుతోంది. ఈ విషయమై నిర్మాతలకు ఇప్పటికే హింట్ అందే సింది. అందుకే.. వాళ్లూ.. .జూలై నుంచి షూటింగులు మొదలెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా చిత్రీకరణ చివరి దశలో ఉన్న రాధేశ్యామ్, ఆచార్య, ఆర్.ఆర్.ఆర్.. లాంటి సినిమాలు కాస్త తొందర పడుతున్నాయి. మిగిలిన బడా సినిమాలు సైతం వీలైనంత త్వరగా షూటింగుల్ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాలని భావిస్తున్నాయి. కొన్ని స్టూడియోలలో ఇప్పటికే సెట్ వర్క్ మొదలైపోయింది. శాకుంతలమ్, పుష్ష, గని లాంటి సినిమాలకు సంబంధించిన సెట్ వర్క్ లు ఇప్పుడు మొదలయ్యాయి. ఇదంతా జులైలో షూటింగులు మొదలెట్టడానికే.
మరోవైపు థియేటర్లకూ అనుమతులు వచ్చేస్తాయన్న భరోసా నిర్మాతలలో కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇక మిగిలిన రాష్ట్రాలు సైతం.. ఇదే పద్ధతి ఫాలో అవ్వొచ్చు. జూలై ద్వితీయార్థంలో థియేటర్లు తెరచుకునే ఛాన్స్ ఉంది. 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు రావు గానీ, చిన్నా మీడియం రేంజు చిత్రాలకు ఊరట లభిస్తుంది. ఇక బుల్లి తెర కు సంబంధించిన షూటింగులు ఇప్పటికే మొదలైపోయాయి. హైదరాబాద్ లో టీవీ సీరియల్స్, రియాలిటీ షోలకు సంబంధించిన షూటింగులు సాగుతున్నాయి కూడా. అయితే అది కూడా ప్రభుత్వ నిబంధనల్ని అనుసరించే జరుగుతున్నాయి.
థియేటర్లు తెరచుకోవడం ఓ రకంగా శుభ శూచకమే. అయితే… థియేటర్లు తెరచినా, జనం వస్తారా? రారా అనే అనుమానాలు మాత్రం ఆగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు థియేటర్లకు రావడానికి భయపడతారన్నది నిర్మాతలు, పంపిణీదారుల భయం. స్టార్ హీరో సినిమా అయితేనే.. వాళ్లు ఉత్సాహం చూపిస్తారు. చిన్నా చితకా సినిమాల కోసం థియేటర్ల ముందు క్యూ కట్టే పరిస్థితి లేదు. ఈ విషయం నిర్మాతలకూ తెలుసు. కానీ ఎప్పుడో ఒకప్పుడు సినిమాని బయటకు వదులుకోవాలి కదా? తొలిసారి లాక్ డౌన్ ఎత్తేశాక… చాలా చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర వరుస కట్టాయి. వారానికి మూడు నాలుగు సినిమాలొచ్చేశాయి. వాటిలో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్నింటికి డబ్బులొచ్చాయి? అనే విషయం పక్కన పెడితే, కొత్త సినిమాల హంగామా మాత్రం కనిపించింది. ఈసారీ.. అదే సీన్ రిపీట్ అవ్వొచ్చు. పెద్ద సినిమాలు మాత్రం దసరాకే బరిలో దిగుతాయి. ఈలోపు థర్డ్ వేవ్ అంటూ వచ్చిందంటే అప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయి. అదే జరిగితే 2021ని కూడా బ్లాక్ లిస్టులో చేర్చేయాల్సిందే.