ఈ వేసవిలో చిత్రసీమ ఎదుర్కొన్న గండాల్లో ఏపీ ఎన్నికలు ఒకటి. ఇది వరకెప్పుడూ లేనంతగా ఏపీ రాజకీయాలు వేడెక్కడంతో… ప్రజల దృష్టంతా అటువైపే ఉంది. కొత్త సినిమా కబుర్లని చెప్పుకోవడానీ, థియేటర్ల వరకూ వెళ్లడానికీ ఎందుకో… ససేమీరా అన్నారు. దాంతో బాక్సాఫీసు దగ్గర సందడి తగ్గింది. వేసవిలో రావాల్సిన సినిమాలన్నీ, వాయిదా పడ్డాయి. దరిమిలా… థియేటర్లన్నీ వెలవెలబోయాయి. ప్రతీవారం చిన్నాచితకా సినిమాలు వస్తూనే ఉన్నా, ప్రేక్షకులు వాటిని పట్టించుకోలేదు. దాంతో ఒక్క సినిమాకీ వసూళ్ల కళ అబ్బలేదు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. దాంతో… టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకొంటోంది.
ఈనెల 17 నుంచి కొత్త సినిమాల జోరు మొదలుకావాల్సివుంది. విశ్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈవారమే రావాలి. అయితే ఆ సినిమా మరికొంత సమయం తీసుకొంది. ఈనెల 31న ఒకేసారి నాలుగైదు సినిమాలు వరుసకట్టబోతున్నాయి. మే చివరి వారం నుంచి ఇక కొత్త సినిమాలు వరుస కట్టడం ఖాయమైంది. అప్పటి వరకూ ఎందుకు ఆగాల్సివచ్చిందంటే… ఐపీఎల్ సమయం క్లైమాక్స్ కి చేరుకొంది. కీలకమైన ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్లు మే చివరి వారంలో జరగబోతున్నాయి. అవన్నీ అయిపోతే.. బాక్సాఫీసు పూర్తిగా రిలాక్స్ అయిపోవొచ్చు. జూన్, జులై, ఆగస్టు.. ఇలా వరుసగా ప్రతీ నెలలోనూ ఓ పెద్ద సినిమాలు, నాలుగైదు మీడియం రేంజు సినిమాలు బాక్సాఫీసు ముందుకు వస్తాయి. వేసవిలో కనిపించాల్సిన హంగామా కాస్త ఆలస్యంగా వర్షాకాలానికి షిఫ్ట్ అయ్యిందనుకోవాలి.
ఇక ఇప్పటి వరకూ రాజకీయాలంటూ బిజీ అయిన నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు పూర్తిగా సినిమాలవైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది.పవన్ అయినా కాస్త సమయం తీసుకొంటాడేమో కానీ, బాలయ్య మాత్రం వెంటనే రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బాబి దర్శకత్వంలో రూపొందించే చిత్రం కోసం బాలయ్య డేట్లు కూడా కేటాయించార్ట. జూన్ లో బోయపాటి – బాలయ్య సినిమా లాంఛనంగా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక పవన్ `ఓజీ` పూర్తి చేయాలి. మరోవైపు ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి డేట్లు సర్దుబాటు చేయాల్సివుంది.