కరోనా ఎఫెక్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాలూ తల్లడిల్లుతున్నాయి. వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి. ఈ నష్టాన్ని నిర్దిష్టంగా లెక్క వేయడానికే చాలా కాలం పట్టేట్టు వుంది. తెలుగు ప్రజల్ని ఆదుకోవడానికి స్టార్లు తమకు తాముగా ముందుకొచ్చారు. లక్షల్లో విరాళాలు ప్రకటించారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. సీసీసీ ద్వారా సినీ కార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు మరోసారి టాలీవుడ్ మొత్తం కదిలిరాబోతోందని టాక్. గతంలో ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు విరాళాల సేకరణ కోసం టాలీవుడ్ అంతా ఏకమైంది. ఈసారీ అలాంటి ప్రయత్నం జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. హుద్ హుద్ సంభవించినప్పుడు టాలీవుడ్ లోని స్టార్సంతా వివిధ కార్యక్రమాల్ని నిర్వహించారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈసారీ అలాంటి ఓ కార్యక్రమమమే నిర్వహించాలన్న ఆలోచన వుంది. అయితే అందుకోసం ఏం చేయాలి? ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా స్పష్టత లేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తరవాత, కొన్ని సడలింపులు ప్రకటిస్తే, సినిమావాళ్లంతా కలిసి కూర్చుని ఈ విషయమై ఓ నిర్ణయానికి రావొచ్చు. చిన్న చిన్న స్కిట్స్, వినోద కార్యక్రమాలు నిర్వహించి, మూడు గంటల ప్యాకేజీలా మార్చి, ఓ ఛానల్‌కి అమ్ముకోవడం ద్వారా… కొంత మొత్తాన్ని సేకరించే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న విషయంలో ఇప్పుడు ప్రణాళికలు రచిస్తున్నట్టు టాక్.