చిత్రసీమకు ఉపశమనం కలిగించే వార్త. లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులకూ రెడ్ సిగ్నల్ పడింది. షూటింగులు ఎప్పుడు మొదలెట్టినా, ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని చిత్రసీమ కోరుకుంటోంది. ఈ విషయమై… మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ని కలుసుకుని తమ బాధల్ని చెప్పుకున్నారు నిర్మాతలు.
ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన లభించింది. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖులతో మంత్రి భేటీ వేశారు. ఈ సందర్భంగా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ల అనుమతులపై చర్చ జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి తమకేం అభ్యంతరం లేదని మంత్రి దర్శక నిర్మాతలకు స్పష్టం చేశారు. షూటింగుల అనుమతి విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. బహుశా జూన్ 1 నుంచి షూటింగులకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అయితే… సెట్లో ఎంత మంది ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయంపై ప్రభుత్వం ఇచ్చే స్పష్టమైన గైడ్ లైన్స్ని పాటించాల్సివుంటుంది.