మహేష్‌బాబు – రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. రాజమౌళి ప్రస్తుతం షూటింగ్ హడావుడిలో ఉన్నారు. కథానాయిక ప్రియాంకా చోప్రా ఫిక్స్ అయిపోయినట్టే. అధికారిక ప్రకటన రావాల్సివుంది. ప్రతినాయకుడిగా ఫృథ్వీరాజ్ సుకుమారన్ నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ హీరో ఎవరన్నది సస్పెన్స్. రాజమౌళి అనుకొంటే, ప్రతీ కీలకమైన పాత్రకు స్టార్ నే రంగంలోకి దింపొచ్చు. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లని దిగుమతి చేసుకోవొచ్చు. అయితే ఈసారి తెలుగు నుంచే ఆ హీరోని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు టాక్. తెలుగు నుంచి ఓ బడా స్టార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ హీరో ఎవరన్నది సస్పెన్స్.
ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్ వేశారు. అక్కడే షూటింగ్ జరగబోతోందని సమాచారం. దీంతో పాటు.. హైదరాబాద్ – విజయవాడ హైవేకు సమీపంలో మరో సెట్ తీర్చిదిద్దుతున్నారు. వారనాసిలో కూడా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. అటవీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని ఎక్కడ తీయాలన్నదానిపై కూడా దాదాపుగా ఓ స్పష్టత వచ్చేసిందని తెలుస్తోంది. సాధారణంగా తన సినిమా ప్రారంభించేటప్పుడు ఓ ప్రెస్ మీట్ నిర్వహించి, సినిమా విశేషాల్ని పంచుకోవడం రాజమౌళికి అలవాటు. అయితే ఈసారి అలాంటి ప్రెస్ మీట్లేం లేవని తెలుస్తోంది. కాకపోతే.. ఒక్కో అప్ డేట్ కాస్త ఆసక్తికరంగా వదలాలని ప్లాన్ చేస్తున్నారు.