టాలీవుడ్ హీరోలంతా ఏకమయ్యారు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్‌బాబు, నాని, అఖిల్ ఇలా దాదాపు 20 మంది కథానాయకులు ఓ చోట చేరారు. రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరి వాళ్లంతా ఎలాంటి నిర్ణయానికి వచ్చారు? చివరికి ఏం తేల్చారు? అనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఈరోజు రాత్రి 7 గంటలకు చిరంజీవి అధ్యక్షతన అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో ఓ భారీ సమావేశం జరిగింది. చిత్రసీమలోని ప్రముఖ హీరోలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. నిర్మాతల మండలిలోని కీలక సభ్యులు సైతం ఈ మీటింగ్‌కి వచ్చారు. రాత్రి 9 గంటల వరకూ ఈ మీటింగ్ కొనసాగింది. పరిశ్రమలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఓ సమీక్షలాంటిది జరిగిందని, హీరోలంతా తమ తమ ఇబ్బందుల్ని చెప్పుకున్నారని, మీడియాతో ఎలా వ్యవహరించాలో చర్చించుకున్నారని తెలుస్తోంది. కొన్ని ఛానళ్ల వ్యవహార శైలిపై సుదీర్ఘంగా చర్చ సాగినట్టు సమాచారం. ఇటీవల పవన్ కల్యాణ్ – రాంగోపాల్ వర్మ ఉదంతం కూడా చర్చల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. మీడియా ముందు కాస్త సంయమనం పాటించాలని, తొందరపడి ఎవరూ నోరు జారొద్దని చిరంజీవి సున్నితంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే వీళ్లంతా కలసి ఏం నిర్ణయం తీసుకున్నారు? ఛానళ్లపై కొరడా ఝులిపిస్తారా? అనేది మాత్రం తెలియరాలేదు. చిరంజీవికి మీడియా ముందు ఎలా ఉండాలో బాగా తెలుసు. మీడియా విలువ కూడా తెలుసు. ఆయన మీడియాపై ఎలాంటి వ్యతిరేక నిర్ణయాలని ప్రోత్సహించే అవకాశం లేదు. సో… మీడియాపై ఎలాంటి చర్యలూ లేనట్టే.