వెట్రిమారన్‌కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నేల విడచి సాము చేయని కథలతో మన మూలాల్ని, వ్యవస్థలోని లోపాల్ని ప్రశ్నించడం వెట్రిమారన్ ప్రత్యేకత. తన సినిమా అంటే…హీరోలకు అవార్డులు గ్యారెంటీ అనే నమ్మకం ఉంది. తన కథలోని పాత్రల్ని నెవర్ బిఫోర్ అన్నట్టు గా తెరపై చూపిస్తారాయన. వెట్రిమారన్ కథల్లో కమర్షియల్ యాంగిల్ ఉండదు. తన సినిమాలు వందల కోట్లు గుమ్మరించలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకొన్నాయి. చరిత్రలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకొన్నాయి.వెట్రిమారన్‌తో సినిమాలు చేయాలని టాలీవుడ్ హీరోలు సైతం తహతహలాడుతున్నారంటే తన క్రేజ్ అర్థం చేసుకోవొచ్చు. తను కూడా ఇప్పుడు తెలుగు హీరోలపై దృష్టి నిలిపాడు. ఎన్టీఆర్ తో వెట్రిమారన్ ఓ సినిమా చేస్తారని, అది ఓ మల్టీస్టారర్ అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఎన్టీఆర్‌ని కలిశానని, కథ గురించి మాట్లాడుకొన్నామని, అయితే ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వెళ్తుందో చెప్పలేమన్నారు. అదీ నిజమే. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు చాలా బిజీ. చేతినిండా సినిమాలున్నాయి. తాను ఖాళీ అవ్వాలంటే సమయం పడుతుంది. బన్నీతో కూడా వెట్రిమారన్ ఓ సినిమా చేసే ఆలోచన ఉంది. ఇప్పుడు కాదు కానీ, చాలా కాలం క్రితమే బన్నీని కలిశానని ఓ కథ కూడా చెప్పానని, కానీ ఎందుకో వర్కవుట్ కాలేదని అన్నాడు. అయితే బన్నీతో తాను ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాడట. మహేష్ కూడా ఓ సందర్భంలో కలిసి కథ ఉంటే చెప్పమన్నాడని వెట్రిమారన్ చెబుతున్నాడు. ఈరోజుల్లో ఏదైనా సాధ్యమే. లోకల్ కథల్ని గ్లోబల్ స్థాయిలో చెప్పడానికి దర్శకులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి సినిమాల్లో నటించాలని హీరోలూ భావిస్తున్నారు. త్వరలోనే వెట్రిమారన్ తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా ప్రటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.