వరుస పరాజయాలు టాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇది వరకు సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా కనీసం ఓపెనింగ్స్ అయినా ఉండేవి. ఇప్పుడు ఫ్లాప్ అనే మాట వినిపిస్తే… తొలి రోజు నుంచే థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. పది టికెట్లు కూడా తెగని పక్షంలో… షోలు కాన్సిల్ చేస్తున్న సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా కొత్త సినిమాల్ని కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. టీజర్, ట్రైలర్ చూసేంత వరకూ బేరాలు ఆడడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇది వరకటిలా ఓటీటీ మార్కెట్ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. కనీసం ఓటీటీ రైట్స్ అయినా వస్తాయన్న నిర్మాతల ఆశలకు గండి పడినట్టే.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్మాతలు కాస్త ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొత్త సినిమాల్ని టేకప్ చేసేటప్పుడు మార్కెట్, బడ్జెట్ లను పూర్తిగా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. ఇది వరకటిలా… హీరోలకు ఎంత పడితే అంత పారితోషికాలు ఇచ్చే అలవాటుకు చెక్ పెట్టాల్సిందే. హీరో డేట్లు దొరికితే చాలు, ఎంత అడిగినా ఇస్తామన్న వైఖరిని పక్కన పెట్టి, పారితోషికాల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిశగా కొంతమంది నిర్మాతలు ఇప్పటికే ఓ అడుగు ముందుకు వేసినట్టు తెలుస్తోంది. బడా హీరోల రెమ్యునరేషన్లో 20 నుంచి 30 శాతం కోత విధిస్తున్నారని, ఈ మేరకు హీరోలు కూడా నిర్మాతల కోసం కాస్త దగి వస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈమధ్య ఓ హీరోకి వరుసగా ఫ్లాపులు తగిలాయి. ఆ హీరో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. సదరు నిర్మాత కోరిక మేరకు ఆ సినిమా పారితోషికంలో 20 శాతం తగ్గించుకొన్నాడని టాక్. మరో హీరోకి ఓటీటీ మార్కెట్ ఢమాల్ మని పడిపోయింది. ఆ హీరో నటించే సినిమాల్ని కొనడానికి ఓటీటీ సంస్థలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన హీరో.. తన పారితోషికాన్ని తానే తగ్గించుకొన్నాడని తెలుస్తోంది. ఇది నిజంగా మంచి పరిణామమే. హీరోలంతా ఇలానే ఓ మెట్టు దిగి వస్తే.. నిర్మాతలపై భారం తగ్గుతుంది. హిట్లూ, ఫ్లాపులతో సంబంధం లేదు,మార్కెట్ ఎలా ఉన్నా, నేను అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందే అనుకొంటే మాత్రం కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందాన తయారవుతుంది. ఈ వైఖరి లోంచి ఇంకొంత మంది హీరోలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.