తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు.. టాలీవుడ్ లో బంద్ మొదలైంది. ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయాయి. వేతనాల పెంపుకోసం గత కొన్ని నెలలుగా.. సినీ కార్మికులు పోరాడుతున్నారు. కానీ… ఈ విషయమై నిర్మాతల నుంచి స్పందన రాకపోయేసరికి, ఈరోజు నుంచి బంద్ చేయాలని నిర్ణయించుకొన్నారు. చిత్రసీమలోని 24 విభాగాలకు చెందిన కార్మికులు ఈ బంద్ లో పాలు పంచుకొంటున్నారు. వేతనాలు పెంచే వరకూ షూటింగులకు రామని.. సినీ కార్మికులు అల్టిమేట్టం జారీ చేశారు. ఈరోజు ఉదయమే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి చేరుకొన్న సినీ కార్మికులు.. అక్కడ భైటాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే వాహనాలను అడ్డుకొన్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి ఫిలిం ఫెడరేషన్ ముందు ఆందోళన నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఈరోజు ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి తో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు. సినీ కార్మికుల వేతనాల విషయంలో చర్చ జరిగే అవకాశం ఉంది.