టికెట్ రేట్ల గొడవ ఇంకా తేలలేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. తిమ్మరుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుదల అవుతున్నాయి. లాక్ డౌన్ తరవాత విడుదల అవుతున్న తొలి చిత్రాలివి. తెలంగాణలో ఎలాంటి గొడవా లేదు. తెలంగాణ ప్రభుత్వం చిత్రసీమకు కావల్సినంత చేయూత ఇస్తోంది. థియేటర్ల పునః వ్యవస్థీకరణకు అండగా ఉంది. పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే హక్కుని థియేటర్ల యాజమాన్యానికి ఇచ్చింది. టికెట్ రేట్ల విషయంలోనూ పట్టువిడుపులు ప్రదర్శించింది. కానీ… ఆంధ్రాలో అలా లేదు. తగ్గించిన టికెట్ రేట్లని సవరించే విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అసలు ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి? ఎలా ఉండబోతున్నాయి? అనే విషయాల్లో ఎలాంటి స్పష్టతా లేదు. పైగా నైట్ షోలకు ఏపీలో అనుమతి లేదు. అక్కడ 50 శాతమే ఆక్యుపెన్సీ. ఇన్ని పరిమితుల మధ్య ఏపీలో సినిమాల్ని విడుదల చేసుకోవాల్సి ఉంది. అయినా సరే… ఇష్క్, తిమ్మరుసులు బరిలోకి దిగుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలుసుకుని, తమ బాధలు చెప్పుకోవాలని, చిత్రసీమకు వెసులుబాటు కలిగించే అంశాల్ని జగన్ దృష్టికి తీసుకెళ్లాలని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో జగన్ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదని సమాచారం. చిత్రసీమపై మొదట్నుంచి జగన్ కినుక వహిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఎన్నిక అయినప్పుడు చిత్రసీమకు చెందినవాళ్లెవరూ తనని కలుసుకోలేదని, అభినందనలు చెప్పలేదని, సన్మాన కార్యక్రమాలేవీ నిర్వహించలేదని జగన్ ఫీలయ్యారని, అందుకే టాలీవుడ్ విషయంలో ఆయన గుర్రుగా ఉన్నారని వైకాపా అభిమానులు సైతం చెప్పుకుంటుంటారు. అదే కోపంతో.. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించారని, సవరించిన టికెట్ రేట్ల విషయంలో టాలీవుడ్ కి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఎన్ని అభ్యర్థనలు వచ్చినా ఆయన పట్టించుకోలేదని, గత కొన్ని రోజులుగా జగన్ అప్పాయింట్ కోసం టాలీవుడ్ పెద్దలు ఎదుర చూస్తున్నారని అయినా అటు నుంచి ఎలాంటి స్పందనా లేదని తెలుస్తోంది.