2021లో సగం రోజుల్ని కరోనా తినేసింది. టాలీవుడ్ కి థియేటర్ల సమస్య వెంటాడింది. ఏపీలో టికెట్ రేట్ల గొడవ ఒకటి. అందుకే పెద్ద సినిమాలు రావడానికి భయపడ్డాయి. సెకండ్ వేవ్ తరవాత.. థియేటర్లు తెరచుకున్నా, చిన్న సినిమాలే దిక్కయ్యాయి. ఇప్పటి వరకూ అర కొర విజయాలే పడ్డాయి. కాకపోతే… మంచి సీజన్ ముందుంది. ఈ రెండునెలల్లో క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. వాటిపై 2021 టాలీవుడ్ క్యాలెండర్ ఫలితం ఆధారపడి ఉండబోతోంది.
నిజానికి నవంబరు, డిసెంబరు… నెలలపై నిర్మాతలకు చిన్న చూపు ఉంటుంది. ఎందుకంటే దీపావళి తరవాత పండగలేం లేవు. పెద్ద సినిమాలు బరిలో ఉండవు. పైగా సంక్రాంతి దగ్గర్లోనే ఉంటుంది కదా? పెద్ద సినిమా తయారైతే, సంక్రాంతికే తీసుకొద్దాం అనుకుంటారు. కానీ ఈసారి అలా జరగడం లేదు. నవంబరు, డిసెంబరుపై గురి పెట్టారు నిర్మాతలు. దాంతో ఈ రెండు నెలల్లో భారీ సంఖ్యలో సినిమాలు రాబోతున్నాయి. అందులో అఖండ, పుష్ష, శ్యాం సింగరాయ్ లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి.
పుష్ష 1.. డిసెంబరు 17న వస్తోంది. అది పాన్ ఇండియా సినిమా. రంగస్థలం తరవాత సుకుమార్, అలా వైకుంఠపురంలో తరవాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా. ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ – బోయపాటి అఖండ పై కూడా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. బాలయ్యని ఎలా చూపించాలో, బోయపాటికి తెలిసినంత ఎవరికీ తెలియదన్నది వాళ్ల నమ్మకం. ఈసారి కూడా… హిట్టిస్తే, హ్యాట్రిక్ కొట్టినట్టే. నాని కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రం `శ్యాం సింగరాయ్`. డిసెంబరులో సినిమా ఉన్నా, ఇప్పటి నుంచే ప్రమోషన్లు భారీగా చేసేస్తున్నారు. రవితేజ ఖిలాడీ కూడా మంచి డేట్ కోసం ఎదురు చూస్తోంది. దృశ్యమ్ 2, విరాటపర్వం ఎప్పుడో రెడీ అయిపోయాయి. వాటికి కాస్త చోటు దొరికితే చాలు. వీటిమధ్య కనీసం 20 – 25 చిన్న సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించేసుకున్నాయి. రాజా విక్రమార్క, పుష్పకవిమానం, స్కై లాబ్, అర్జున, ఫాల్గుణ, లక్ష్య, గుడ్ లక్ సఖి లాంటి సినిమాలు ఈ యేడాది చివర్లోగా పలకరించబోతున్నాయి. వీటిలో కనీసం నాలుగైదుహిట్లు పడినా.. టాలీవుడ్ కొంత తేరుకుంటుంది. 2022 కి ఘనంగా స్వాగతం పకలడానికి, కొత్త ఆశలు నింపుకోవడానికి ఊపిరి వచ్చినట్టు అవుతుంది. మరి.. 2021 ముగింపు ఎలా ఉండబోతోందో?