ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. అల్లు అరవింద్, సురేష్‌బాబు, అశ్వనీదత్, దానయ్య లాంటి ప్రముఖులు పవన్‌ని కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సమస్యలపై సుదీర్ఘమైన చర్చ నడిచినట్టు తెలుస్తోంది. పలు అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. వాటిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి, పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని పవన్ కల్యాణ్ నిర్మాతలకు మాట ఇచ్చారు. త్వరలో ముఖ్యమంత్రితో నిర్మాతలకు అపాయింట్ మెంట్ కూడా ఇప్పిస్తానని పవన్ మాట ఇచ్చారు. చిత్రసీమలోని వివిధ శాఖల ప్రతినిధులు ఓ టీమ్ గా ఏర్పడి చంద్రబాబునాయుడుతో భేటీ వేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పరిశ్రమకు సంబంధించిన సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ”చిత్రసీమలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి పవర్ ప్రజెంటేషన్ రూపంలో తీసుకెళ్తాం. టికెట్ రేట్ల పెంపు అనేది కేవలం ఓ చిన్న విషయం. వాటికి మించిన సాధకబాధకాలు ఇండస్ట్రీకి ఉన్నాయి” అని అల్లు అరవింద్ చెబుతున్నారు.
టీడీపీ గవర్నమెంట్ ముందు నుంచీ చిత్రసీమ పక్షపాతే. టాలీవుడ్ కు కావల్సిన అనేక అంశాల్లో చంద్రబాబు సానుకూలంగా స్పందించేవారు. గత ప్రభుత్వం సినిమా పరిశ్రమని చిన్నచూపు చూసింది. ఇప్పుడు ఇండస్ట్రీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్న భరోసా నిర్మాతల కళ్లల్లో కనిపిస్తోంది. స్టూడియోల ఏర్పాటుకు స్థలల కేటాయింపు, నంది అవార్డులు, షూటింగులకు అనుమతులు, రాయితీలు, టికెట్ ధరలు… ఇలా చాలా అంశాలు పవన్‌తో భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం.