ఇప్పటికే… టాలీవుడ్ వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. థియేటర్లకురావడానికి జనం భయపడిపోతున్నారు. మరోవైపు ఏపీలో టికెట్ రేట్ల విషయంలో.. సినిమా ఇండ్రస్ట్రీకి పెద్ద అన్యాయమే జరుగుతోంది. ఇవన్నీ చాలవన్నట్టు.. ఒమిక్రాన్ పిడుగు ఒకటి పడబోతోంది. ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాల్ని ఒణికిస్తోంది. ఈ వైరస్ ఉధృతి తీవ్రంగా ఉండబోతోందని డబ్ల్యూ హెచ్ ఓ కూడా హెచ్చరించింది. ఈ వైరస్ ని అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? అని ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏ సమస్య వచ్చినా, ముందు థియేటర్ల వంక చూడడం.. ప్రభుత్వాలకు అలవాటే. సోషల్ డిస్టెన్స్ కోసం… షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ల దగ్గర ఉధృతి కంట్రోల్ చేయడానికే చూస్తుంటారు. కరోనా వచ్చిన తొలి రోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించారు. దాన్ని సడలించడానికి చాలా సమయం పట్టింది. ఆ భయంతోనే… పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. ఇప్పుడు మళ్లీ ఆక్యుపెన్సీ విషయంలో నిబంధనలు విధిస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు చిత్రసీమకు డిసెంబరు చాలా కీలకం. ఏకంగా 3 పెద్ద సినిమాలు (అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్) విడుదల కాబోతున్నాయి. గని, గుడ్ లక్ సఖి కూడా రేసులో ఉన్నాయి. ఈ నెలలో కనీసం 20 సినిమాలైనా రానున్నాయి. ఇలాంటప్పుడు ఆక్యుపెన్సీ నిబంధన గానీ వస్తే… అది చాలా పెద్ద దెబ్బ. ఒమిక్రాన్ ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైతే.. తెలుగు రాష్ట్రాలలో కేసులేం నమోదు కాలేదు. ఎక్కడైనా ఓ కేసు వస్తే… అది వ్యాప్తి చెందడానికి ఎంతో సమయం పట్టదు. ప్రభుత్వాలు ముందస్తు చర్యగా లాక్ డౌన్ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా… టాలీవుడ్ ని ఒణికిస్తున్న విషయాలే.
పెద్ద సినిమాలు వస్తే జనాలు థియేటర్లకు ఈజీగా వస్తారన్న నమ్మకం ఉంది. అఖండతో.. జనాల మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకునే అవకాశం దక్కింది. ఇలాంటి సమయంలోనే ఈ కొత్త వైరస్ బయటకు రావడం… ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు జనం బయటకు రావాలంటే మరింత భయపడతారు. అఖండ సినిమాకి వసూళ్లు అంతంత మాత్రంగా ఉంటే, ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ బయటకు రాకపోతే.. కచ్చితంగా రాబోయే పుష్ప లాంటి సినిమాలకు నెగిటీవ్ సంకేతాలు అందుతాయి. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెద్ద సినిమాలకు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు.