కొత్త బిచ్చగాడు పొద్దెరగడు – అన్నది సామెత. క్లబ్ హోస్ వ్యవహారం కూడా అలానే ఉంది. ఫేస్ బుక్, ట్విట్టర్‌లా కొత్తగా పుట్టుకొచ్చిన సోషల్ మీడియా ఆప్ ఇది. ఇందులో ఒకేసారి 30 – 40 మంది గేదర్ అవ్వొచ్చు. ఒకరి మాటలు ఒకరు వినొచ్చు. తమ అభిప్రాయాలు పంచుకోవొచ్చు. పాటలు పాడుకోవొచ్చు. కథలు చెప్పుకోవొచ్చు. ఈమధ్య వచ్చిన అన్ని ఆప్ ల కంటే.. బెటర్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి… యువతరం.. పిచ్చెక్కినట్టు క్లబ్ హోసుల్లో మునిగిపోతోంది. పొద్దస్తమానం పబ్ జీతో ఎలా కాలక్షేపం చేశారో.. అలా ఇప్పుడు క్లబ్ హోస్ పిచ్చిలో పడిపోయారు. సినిమా సెలబ్రెటీలు సైతం క్లబ్ హోస్ మాయలో పడిపోయారు. ఓ యంగ్ హీరో అయితే… 24 గంటలూ క్లబ్ హోస్ తోనే కాలక్షేపం చేస్తున్నాడట. తనకు ఇదో వ్యసనంలా మారిపోయిందని ఇన్సైడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
ఆ హీరోకి హిట్టు పడి రెండు మూడేళ్లయ్యింది. అయినా సరే, నిర్మాతలు, దర్శకులు తన వెంట పడుతున్నారు. ఇలాంటి సమయంలో జాగ్రత్త పడాల్సింది పోయి.. ఆయా నిర్మాతల్ని, దర్శకుల్ని కూడా విసిగిస్తున్నట్టు సమాచారం. ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని, ఫలానా టైమ్‌కి ఫోన్ చేయమని చెప్పి స్విచ్చాఫ్ చేసుకుంటున్నాడని, ఆ సమయంలో.. క్లబ్ హోస్లో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడని, ఒకవేళ సదరు హీరోని పట్టుకోవాలన్నా.. క్లబ్ హోస్లో మెంబర్ అయి, తద్వారా ఆయనగారితో మాట కలపడం తప్ప.. బయట ఫోన్లకు అందుబాటులో ఉండడం లేదని టాక్. నెల రోజులుగా ఓ దర్శకుడు, నిర్మాత సమేతంగా.. తిరుగుతున్నా, సదరు హీరో దొరకడం లేదని, దానికి కారణం క్లబ్ హోస్ మాయలో పడిపోవడమే అని తెలుస్తోంది. ఇది ఒకరి కథే. ఇలా ఎంతమంది ఉన్నారో?